జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం : భార్యను హత్య చేసి, వీడియో విడుదల చేసి భర్త ఆత్మహత్య

మానవ సంబంధాలు మంట గలసిపోతున్నాయి. క్షణికావేశం ప్రాణాలను తీస్తోంది. నిండూ నూరేళ్లు కలిసుండాల్సిన దంపతులు పోట్లాడుకుంటున్నారు. చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి తన భార్యను చంపి వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా సీతారాంపురంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం సీతరాంపురం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. భార్య తనను తీవ్రంగా వేధిస్తోందంటూ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసిన భర్త, ముందుగా భార్యను హత్య చేసి అనంతరం తానే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

 

గ్రామానికి చెందిన బాలాజీ రామాచారి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థాలు తలెత్తి తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భార్య సంధ్య తల్లిగారి ఇంటి వద్ద ఉంటోంది. ఇటీవల ఓటు వేయడానికి ఈ నెల 11న సంధ్య సీతరాంపురం గ్రామానికి వచ్చింది.

 

శుక్రవారం అర్ధరాత్రి ముందస్తు ప్రణాళికతో భార్య సంధ్యను ఉరివేసి హత్య చేసిన రామాచారి, అనంతరం తన వేదనను వివరిస్తూ వీడియో రికార్డ్ చేశాడు. ఆ వీడియోను విడుదల చేయడంతో పాటు వాట్సాప్ స్టేటస్‌గా కూడా పెట్టాడు. వీడియోలో భార్య వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, ఆ మనస్తాపం వల్లే ఈ ఘోరానికి పాల్పడినట్లు చెప్పుకొచ్చాడు.

 

వీడియో విడుదల చేసిన కొద్దిసేపటికే రామాచారి కూడా ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 

ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబ కలహాలు ఎంతటి అనర్థాలకు దారితీస్తాయో చెప్పే మరో విషాద ఉదాహరణగా ఈ సంఘటన నిలిచింది.

Facebook
WhatsApp
Twitter
Telegram