సోషల్ మీడియాలో వల వేసిన బిహార్ ముఠా అరెస్ట్
సంతానం లేని మహిళలను గర్భవతులను చేస్తే భారీగా డబ్బులు ఇస్తామని ఆశ చూపుతూ అనేక మంది పురుషులను మోసం చేసిన బిహార్‌కు చెందిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. బిహార్ రాష్ట్రం నవాడా జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి రాగా, ‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్’ అనే పేరుతో సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి ఈ ముఠా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
స్త్రీని గర్భవతిని చేస్తే బహుమతిగా రూ.10 లక్షల వరకు ఇస్తామని ప్రచారం చేస్తూ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పురుషులను ఆకర్షించారు. శృంగారం, సులభంగా డబ్బులు సంపాదించొచ్చన్న ఆశ చూపి వారిని ప్రలోభాలకు గురి చేశారు. ప్రకటనలను నమ్మిన పలువురు సంప్రదించగానే, రిజిస్ట్రేషన్ ఫీజు, హోటల్ బుకింగ్, మెడికల్ ఖర్చులు అంటూ వివిధ కారణాలు చెబుతూ వేల నుంచి లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు విచారణలో తేలింది.
మోసానికి గురైన కొందరు బాధితుల ఫిర్యాదులతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, ఇది ఒక వ్యవస్థీకృత ముఠా పని అని స్పష్టమైంది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను వలలో వేసి డబ్బులు కాజేసే విధంగా ఈ ముఠా ప్లాన్ వేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, బ్యాంక్ వివరాలు, నకిలీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇలాంటి ఆకర్షణీయ ప్రకటనలను నమ్మి మోసపోవద్దని, అనుమానాస్పద ఆఫర్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో కనిపించే ఇలాంటి ఉద్యోగాలు, బహుమతుల ప్రకటనల వెనుక పెద్ద మోసాలు దాగి ఉండే అవకాశం ఉందని స్పష్టం చేశారు.









