మూసీ రివర్ నిర్వాసితులకు సీఎం భరోసా

 

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్  / మారుతున్న కాలానికి అనుగుణంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి ప్రణాళికల్లో నిర్వాసితులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకుంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొత్త ప్రాజెక్టుల అమలులో కొందరికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నప్పటికీ, ఎవరినీ అనాధలను చేయబోమని ఆయన భరోసా ఇచ్చారు. భూములు లేదా ఇండ్లు కోల్పోయిన వారికి తగిన నష్టపరిహారం అందించి అన్ని సౌకర్యాలతో పునరావాసం కల్పిస్తామని తెలిపారు.

 

బుద్వేల్ లేఅవుట్‌ను కలిపే రేడియల్ రోడ్–2 ఇంటర్‌చేంజ్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం కొత్వాలగూడలో ఏర్పాటు చేసిన ఎకో పార్క్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

 

మూసీ నది ప్రస్తుతం మురికితో నిండిపోయిందని, కానీ కాలం మారుతున్న నేపథ్యంలో మహానగర అభివృద్ధి ప్రణాళికలను కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ప్రజలు ఎవరూ మురికికూపాల్లో జీవించాలనుకోరని, పరిస్థితుల వల్ల అక్కడ నివసిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి ప్రజలను బయటకు తీసుకువచ్చి మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

 

పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అందరినీ మెప్పించి, ఒప్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ అభివృద్ధిలో స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేస్తామని, అవసరమైతే వారు నివసిస్తున్న ప్రాంతాల దగ్గరే కొత్త ఇండ్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

 

రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, బుల్లెట్ ట్రెయిన్ వంటి భారీ ప్రాజెక్టుల కోసం కొందరు భూములు కోల్పోవాల్సి రావచ్చని, అయితే భూమి కోల్పోయిన బాధను ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని సీఎం అన్నారు. వేరే చోట భూమి కొనుగోలు చేసుకునేంతగా నష్టపరిహారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.

 

అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్, ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్, ఉత్తరప్రదేశ్‌లో గంగా రివర్ ఫ్రంట్‌ల మాదిరిగా హైదరాబాద్‌లో మూసీ రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. దీని చుట్టూ రాత్రిపూట వ్యాపారాలు చేసుకునే అవకాశాలు కల్పించి నైట్ టూరిజాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు.

 

ఈ ప్రాజెక్ట్ వల్ల భూములు కోల్పోయే వారికి ఆయా నియోజకవర్గాల్లోని ప్రభుత్వ స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి పునరావాసం కల్పిస్తామని వెల్లడించారు. హైదరాబాద్ గొప్ప చారిత్రక కట్టడాలతో ప్రపంచంలోనే అందమైన నగరాల్లో ఒకటిగా నిలిచిందని, అయితే కొంతకాలంగా నగరం చెత్త చెదారంతో నిండిపోయిందని పేర్కొన్నారు. ఇప్పుడు నగరాన్ని మళ్లీ అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.

 

హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలు, అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ సమయంలో కూడా కొందరికి ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ఆ ప్రాజెక్టులు ఇప్పుడు నగరానికి గొప్ప ఆస్తిగా మారాయని సీఎం గుర్తుచేశారు. చిన్న కాలనీలు కాకుండా పెద్ద స్థాయి నగర అభివృద్ధి లక్ష్యంతో “భారత్ ఫ్యూచర్ సిటీ”ను నిర్మిస్తున్నామని తెలిపారు.

 

శంషాబాద్ ప్రాంతం త్వరలో బుల్లెట్ ట్రెయిన్ హబ్‌గా మారనుందని, బెంగుళూరు, అమరావతి, చెన్నై నగరాలకు ఇక్కడి నుంచే బుల్లెట్ ట్రెయిన్ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. దీనికి సంబంధించిన దాదాపు అన్ని అనుమతులు వచ్చాయని తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు సంబంధించిన సంస్థలు కూడా హైదరాబాద్‌కు రానున్నాయని పేర్కొన్నారు.

 

ప్రపంచంతో పోటీ పడే విధంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామని, ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

 

ఈ కార్యక్రమంలో ఎంపీలు మల్లు రవి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మల్ రెడ్డి రంగారెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram