భానుడి భగ భగ!

తెలంగాణలో ఎండల ఎఫెక్ట్.. 47 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్!

 

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ / తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకీ ఎండల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

 

నిన్న నిజామాబాద్ జిల్లా సాలూరులో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే పరిస్థితి ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో కూడా కనిపిస్తోంది. ఉదయం నుంచే మండుతున్న ఎండలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుండగా, మధ్యాహ్నం వేళ రోడ్లపై జనసంచారం తగ్గిపోతోంది.

 

వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం ఈ నెల 18 నుంచి 22వ తేదీల మధ్య ఎండలు గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 నుంచి 47 డిగ్రీల వరకు నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దాదాపు 10 రోజుల పాటు వడగాల్పులు తీవ్రంగా వీచే అవకాశముండటంతో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

 

అయితే, నేడు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కానీ ఈ వర్షాలు ఎండల తీవ్రతను పూర్తిగా తగ్గించే అవకాశాలు తక్కువేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గాలిలో తేమ పెరగడం వల్ల ఉక్కపోత కూడా అధికమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

 

వైద్య నిపుణుల సూచనలు..

 

వడదెబ్బ ప్రమాదం అధికంగా ఉండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరం లేకపోతే బయటకు వెళ్లకపోవడం మంచిదని చెబుతున్నారు. బయటకు వెళ్లాల్సి వస్తే తలపై గుడ్డ లేదా క్యాప్ ధరించడం, ఎక్కువగా నీరు తాగడం, మజ్జిగ, కొబ్బరి నీరు, ORS వంటి ద్రవ పదార్థాలు తీసుకోవడం అవసరమని సూచిస్తున్నారు.

 

చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. రైతులు కూడా పొలాల్లో పని చేసే సమయంలో తగిన విరామాలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది.

 

ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లా అధికారులను అప్రమత్తం చేసింది. అవసరమైన చోట్ల తాగునీటి సదుపాయాలు కల్పించడం, వైద్య శిబిరాలు సిద్ధంగా ఉంచడం వంటి చర్యలు చేపడుతోంది.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram