పర్యావరణ పరిరక్షణ మన హక్కు మాత్రమే కాదు, మన బాధ్యత న్యాయమూర్తి కంభపు సూరి రెడ్డి.
గోల్డెన్ న్యూస్ /మణుగూరు /ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మణుగూరు కోర్టు ఆవరణలో గౌరవ న్యాయమూర్తి కంభపు సూరి రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుని రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A(g) ప్రకారం ప్రతి పౌరుడు ప్రకృతి, అడవులు, నదులు, సరస్సులు మరియు వన్యప్రాణులను సంరక్షించి అభివృద్ధి చేయాల్సిన ప్రాథమిక విధి ఉందని వివరించారు.
అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986 (Environment Protection Act, 1986), అటవీ సంరక్షణ చట్టం, 1980 (Forest Conservation Act, 1980) మరియు వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 (Wild Life Protection Act, 1972) వంటి చట్టాల లక్ష్యం ప్రకృతి సంపదను కాపాడటమేనని తెలిపారు.
మొక్కలు మనకు ప్రాణవాయువును అందించడమే కాకుండా, వాతావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. పర్యావరణ కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ మరియు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు.
కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని పెంచి పెద్ద చెట్లుగా తీర్చిదిద్దినప్పుడే పర్యావరణ పరిరక్షణ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొట్టే అజయ్ కుమార్,మణుగూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రకాని గురు కృష్ణ, జనరల్ సెక్రటరీ వీర మధుసూదన్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది మరియు ఎఫ్ ఆర్ ఓ ఉపేంద్ర, అటవీ శాఖ సిబ్బంది పాల్గొని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు.








