గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ /తెలంగాణలో ప్రత్యేకంగా నిర్వహించిన లోక్‌అదాలత్ ద్వారా 6303 మంది సైబర్ మోసం బాధితులకు రూ. 45.21 కోట్ల నగదును రీఫండ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే అత్యధికంగా రూ. 21.91 కోట్లు రికవరీ అయ్యాయి. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 59953 మంది బాధితులకు రూ. 445.41 కోట్లు తిరిగి ఇప్పించారు. సైబర్ మోసం జరిగిన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
ఈ రికవరీ ప్రక్రియలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అత్యంత కీలకపాత్ర పోషించి ముందంజలో నిలిచింది. ఒక్క సైబరాబాద్ పరిధిలోనే 2,232 మంది బాధితులకు చెందిన రూ. 21.91 కోట్లు రికవరీ చేసి వెనక్కి ఇప్పించారు. అదేవిధంగా.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నేరుగా తన పరిధిలోని 77 మంది బాధితులకు సంబంధించిన రూ. 6.83 కోట్లను రికవరీ చేసింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. మల్కాజిగిరి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలు సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతాల నుంచి సొమ్మును రికవరీ చేయడంలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచాయి.








