ఎలక్ట్రిక్ స్కూటర్లకు లైసెన్స్ ఎందుకు అవసరం ఉండదు.. ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా.?

 

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. అయితే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లను నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేకపోవడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మ‌రి దీనికి కార‌ణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా…

 

తక్కువ వేగం ఉన్న స్కూటర్లకు లైసెన్స్ అవసరం లేదు

కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ స్కూటర్లను వాటి వేగం, మోటార్ సామర్థ్యం ఆధారంగా వర్గీకరించింది. కొన్ని స్కూటర్లు “లో-స్పీడ్ ఎలక్ట్రిక్ వాహనాలు” కేటగిరీలోకి వస్తాయి. సాధారణంగా గంటకు 25 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్టీఓ రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు. ఇలాంటి వాహనాలను తక్కువ ప్రమాదకర వాహనాలుగా ప్రభుత్వం పరిగణిస్తుంది. అందుకే వాటికి ప్రత్యేక మినహాయింపులు కల్పించింది.

 

ప్రభుత్వం ఈ సడలింపు ఎందుకు ఇచ్చింది?

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. కాలుష్యాన్ని తగ్గించడం, ఇంధన వినియోగాన్ని నియంత్రించడం కోసం ఈవీలను ప్రోత్సహిస్తోంది. లో-స్పీడ్ స్కూటర్లు సాధారణంగా కాలనీలు, పట్టణ ప్రాంతాలు, చిన్న దూరాల ప్రయాణాలకు ఉపయోగపడతాయి. వీటి వేగం తక్కువగా ఉండటంతో ప్రమాదాల అవకాశం కూడా తక్కువగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ప్రజలు సులభంగా ఈ వాహనాలను ఉపయోగించేందుకు లైసెన్స్ నిబంధనలను సడలించింది.

 

లైసెన్స్ లేకున్నా ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి

డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదని చెప్పడం వల్ల ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదని కాదు. ఎలక్ట్రిక్ స్కూటర్ అయినా, ఇతర వాహనం అయినా రోడ్డు భద్రతా నియమాలు అందరికీ ఒకేలా వర్తిస్తాయి. ప్రయాణ సమయంలో హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, అతివేగంగా నడపకపోవడం, రోడ్డు భద్రతా నిబంధనలను పాటించ‌డం వంటివి క‌చ్చితంగా పాటించాల్సిందే.

Facebook
WhatsApp
Twitter
Telegram