డిసెంబర్ నెలాఖరులోగా జిల్లాలో రీసర్వే ప్రక్రియ పూర్తి చేయాలి
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు ప్రతి మారుమూల గ్రామానికి చేరాలి
భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాలోని మారుమూల, సరిహద్దు గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు.
మంగళవారం మణుగూరు మండలం చిన్నరాయిగూడెం గ్రామంలో చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామ సరిహద్దులు, అటవీ భూముల హద్దులు, భూముల విస్తీర్ణం, సర్వే పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గ్రామ పరిధిలో మొత్తం 1,395 ఎకరాల భూమి ఉండగా, అటవీ శాఖ రికార్డుల ప్రకారం 554 ఎకరాలు అటవీ భూమిగా ఉన్నట్లు అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా రైతులు తమ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు, సర్వే నంబర్లు, రెవెన్యూ రికార్డులు, అటవీ శాఖ అభ్యంతరాల కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. రైతుల వినతులను పరిశీలించిన కలెక్టర్, రీసర్వే పూర్తయిన అనంతరం భూముల సరిహద్దులు, రెవెన్యూ, అటవీ భూములకు సంబంధించిన వివరాలపై స్పష్టత వస్తుందని తెలిపారు. రైతులు సమర్పించిన దరఖాస్తులను రికార్డుల ఆధారంగా క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం గ్రామస్తులతో మాట్లాడి తాగునీరు, విద్యుత్, వీధి దీపాలు, మొబైల్ నెట్వర్క్, రహదారి సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని, విద్యుత్ సమస్యలను పరిష్కరించి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రాంనగర్ నుంచి పాములపాడు వరకు రహదారి సౌకర్యం లేక అత్యవసర వైద్య సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు తెలపగా, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 70 కాడస్ట్రల్ గ్రామాలతో పాటు, మ్యాప్లు లేని 7 నాన్ కాడస్ట్రల్ గ్రామాల్లో రీసర్వే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. సుమారు రెండు నెలల క్రితం ప్రారంభించిన ఈ ప్రక్రియను డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. జిల్లాలోని 23 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించి, మండల కేంద్రాలకు సమీపంలోని గ్రామాలతో పాటు మారుమూల, సరిహద్దు గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించినట్లు తెలిపారు.
ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం, తాగునీటి సౌకర్యం, చేయూత పింఛన్లు తదితర సంక్షేమ పథకాల అమలును నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చూడటంతో పాటు, గ్రామాల్లో మౌలిక సదుపాయాల సమస్యలను సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించాలని స్పష్టం చేశారు.
రీసర్వే ప్రక్రియలో రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, భూముల సరిహద్దులు, రికార్డులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా, పకడ్బందీగా సర్వే నిర్వహించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రీసర్వే ద్వారా భూముల హద్దులు, భూ రికార్డులపై స్పష్టత ఏర్పడి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరేష్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, సర్వేయర్లు, అటవీ శాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.









