అవగాహన లేక ఓటర్లలో గందరగోళం.
చదువురాని వాళ్ల పరిస్థితి ఏంటి.
గోల్డెన్ న్యూస్ / కరకగూడెం /అర్హులకు మాత్రమే ఓటుహక్కు కల్పించాలనే ఉద్దేశంతో చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై ఓటర్లకు అవగాహన కొరవడింది. బూత్ లెవల్ అధికారులు (బీఎల్వో) ఇచ్చే ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఓటర్ల సందేహాలను నివృత్తి చేయలేక బీఎల్వోలూ గందరగోళానికి గురవుతున్నారు.
ఈ నెల 25 నుంచి ప్రారంభమైన ‘సర్’ కార్యక్రమం వచ్చే నెల 24వ తేదీ వరకు కొనసాగనుంది. బీఎల్వోలు తమ పరిధిలోని ఓటర్లకు వారి ఫొటో, క్యూఆర్ కోడ్తో ముద్రించిన ఫారాలు ఇంటింటికి తిరిగి సర్ఫామ్ అందజేసి నింపాలని చెబుతున్నారు. వాటిని ఎలా పూరించాలో అర్థంకాక చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. శిక్షణ పొందిన కొందరు బి ఎల్ వో లు సైతం సందేహాలను నివృత్తి చేయలేకపోతున్నారు. సహాయక కేంద్రాలను సంప్రదిస్తే.. స్థానిక బీఎల్వోనే అడగండి అంటూ తిప్పి పంపుతున్నారు. చివరకు ఫారాలు చేతపట్టుకుని నాయకుల వద్ద కు, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల చుట్టూ ఓటర్లు తిరుగుతున్నారు.








