ఫేస్‌బుక్ ట్రేడింగ్ ప్రకటనతో డాక్టర్‌కు సైబర్ షాక్!

నకిలీ పెట్టుబడి హామీలతో రూ.1.21 కోట్లు స్వాహా..

51 విడతల్లో నగదు బదిలీ.. మల్కాజిగిరి సైబర్ పోలీసులకు ఫిర్యాదు

 

హైదరాబాద్ : సోషల్ మీడియాలో వచ్చే పెట్టుబడి ప్రకటనలను గుడ్డిగా నమ్మితే ఎంతటి ఆర్థిక నష్టం జరుగుతుందో ఈ ఘటన మరోసారి నిరూపిస్తోంది. ఫేస్‌బుక్‌లో కనిపించిన ట్రేడింగ్ ప్రకటనను నమ్మిన హైదరాబాద్‌కు చెందిన 56 ఏళ్ల వైద్యుడు సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.1,21,59,801 కోల్పోయారు.

 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరి పరిధిలోని గౌతంనగర్‌కు చెందిన వైద్యుడికి ఆగస్టు 11న ఫేస్‌బుక్‌లో ఆన్‌లైన్ పెట్టుబడులకు సంబంధించిన ప్రకటన కనిపించింది. అందులో కేంద్ర మంత్రిని పోలిన నకిలీ వీడియోతో పెట్టుబడులపై భారీ లాభాలు వస్తాయని ప్రచారం చేశారు. కేవలం రూ.22 వేల పెట్టుబడితో రోజుకు రూ.80 వేల వరకు ఆదాయం వస్తుందని ఆశ చూపినట్లు సమాచారం.

 

ఆ ప్రకటనను నమ్మి వివరాలు నమోదు చేసుకున్న వైద్యుడిని వివిధ ట్రేడింగ్ సంస్థల ప్రతినిధులమంటూ పలువురు ఫోన్ చేసి సంప్రదించారు. ఫారెక్స్ ట్రేడింగ్‌లో భారీ లాభాలు వస్తాయని నమ్మించి ఐదు రకాల పెట్టుబడి యాప్‌లను డౌన్‌లోడ్ చేయించారు.

 

వారి మాటలు నమ్మిన వైద్యుడు ఆగస్టు 11 నుంచి అక్టోబర్ 9 వరకు తన రెండు బ్యాంకు ఖాతాల నుంచి మొత్తం 51 విడతల్లో వివిధ యూపీఐ ఐడీలు, బ్యాంకు ఖాతాలకు రూ.1.21 కోట్లకు పైగా బదిలీ చేశారు. యాప్‌లలో భారీ లాభాలు వచ్చినట్లు చూపించినప్పటికీ, ఆ డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించి అక్టోబర్ 27న జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

 

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల బ్యాంకు ఖాతాలు, లావాదేవీలపై దర్యాప్తు చేపట్టారు.

 

ప్రజలకు హెచ్చరిక :

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో కనిపించే అధిక లాభాల పెట్టుబడి ప్రకటనలను నమ్మవద్దు. ప్రముఖుల వీడియోలు, పేర్లు కనిపించినంత మాత్రాన అవి నిజమైనవని భావించవద్దు. గుర్తింపు లేని ట్రేడింగ్ యాప్‌లలో డబ్బులు పెట్టి మోసపోవద్దు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram