భర్త మరణిస్తే భార్యకు వెంటనే పింఛన్..
57 ఏళ్లలోపు ఉంటే వితంతు పింఛన్, ఆపై వృద్ధాప్య పింఛన్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయూత పింఛన్‌దారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ పొందుతున్న పురుష లబ్ధిదారుడు మరణిస్తే, ఆయన భార్యకు పింఛన్ సదుపాయం కల్పించే విధానాన్ని ఇతర ప్రధాన పింఛన్ కేటగిరీలకు కూడా విస్తరించింది. దీంతో భర్తను కోల్పోయిన మహిళలు నెలవారీ ఆర్థిక సహాయం పొందేందుకు అవకాశం కలగనుంది.
ఆరు ప్రధాన కేటగిరీలకు వర్తింపు
ఈ నిర్ణయంతో కింది పింఛన్ కేటగిరీలకు చెందిన పురుష లబ్ధిదారులు మరణించినప్పుడు వారి భార్యలకు పింఛన్ మంజూరు చేసే అవకాశం ఉంటుంది.
వృద్ధాప్య పింఛన్‌దారులు దివ్యాంగుల పింఛన్‌దారులు గీత కార్మికులు చేనేత కార్మికులు డయాలసిస్ బాధితులు హెచ్‌ఐవీ, ఫైలేరియా బాధితులు. వయస్సును బట్టి పింఛన్ కేటాయింపు
భర్త మరణించిన సమయంలో భార్య వయస్సు 57 ఏళ్లలోపు ఉంటే వితంతు పింఛన్ మంజూరు చేస్తారు. 57 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉంటే వృద్ధాప్య పింఛన్ కేటగిరీలో పింఛన్ అందించనున్నారు.
దరఖాస్తుకు అవసరమైన పత్రాలు భార్య ఆధార్ కార్డు బ్యాంకు పాస్‌బుక్ మొదటి పేజీ మరణించిన భర్త ఆధార్ కార్డు భర్త మరణ ధ్రువీకరణ పత్రం
ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?
గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శికి, పట్టణ ప్రాంతాల్లో బిల్ కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించాలి. అధికారులు సమర్పించిన పత్రాలను, అర్హత వివరాలను పరిశీలించి చేయూత పోర్టల్‌లో నమోదు చేస్తారు. అనంతరం నిబంధనల ప్రకారం పింఛన్ మంజూరు చేస్తారు.
ఆధారపడిన మహిళలకు ఆర్థిక భద్రత
కుటుంబంలో పింఛన్ పొందుతున్న వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబానికి అందే నెలవారీ ఆర్థిక సహాయం నిలిచిపోవడంతో మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా భర్తపై ఆధారపడి జీవించే మహిళలకు ఈ పరిస్థితి మరింత భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పింఛన్ సదుపాయాన్ని ఇతర కేటగిరీలకు విస్తరించడం ద్వారా అర్హులైన మహిళలకు ఆర్థిక భరోసా కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
అయితే పింఛన్ ఆటోమేటిక్‌గా మంజూరు కాదు. సంబంధిత అధికారులు పత్రాలను, అర్హతను పరిశీలించిన తర్వాతే పింఛన్ మంజూరు చేస్తారు. కాబట్టి అర్హులైన కుటుంబాలు అవసరమైన పత్రాలతో సంబంధిత అధికారులను సంప్రదించాలి.









