గోల్డెన్ న్యూస్ /భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన పవిత్ర క్షేత్రం భద్రాచలం శ్రీరామాలయంలో ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించిన సీతారాముల కల్యాణం అద్భుతమైన భక్తి పారవశ్యంలో, వైభవంగా సాగింది. వేలాదిమంది భక్తులు ఈ అపూర్వ దృశ్యాన్ని తిలకించేందుకు హాజరయ్యారు. అనంతరం సోమవారం శ్రీరామ మహా పట్టాభిషేకం అత్యంత విశిష్టంగా జరగింది.
సీతారాముల కళ్యాణం – స్వర్ణ శిఖరాల వైభవం
శ్రీరామ నవమి రోజున తెల్లవారుజామున 2 గంటలకే స్వామివారికి సుప్రభాత సేవలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తిరువారాధన, మంగళాశాసనం అనంతరం, ఉదయం 9.45కి భద్రాచలంలోని మిథిలా స్టేడియానికి స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులు ఊరేగింపుగా తీసుకెళ్లారు. స్వర్ణ సింహాసనంపై ఆసీనులను చేసిన తరువాత, భక్తరామదాసు చేయించిన నగలతో అలంకరించి కల్యాణ వేడుక ఘనంగా నిర్వహించారు.
అభిజిత్ లగ్నానికి అనుగుణంగా మంగళ్యధారణ జరిగి, జీలకర్రబెల్లంతో వేద మంత్రోచ్చారణల నడుమ కల్యాణం అత్యంత పుణ్యంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి గీత స్వయంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
శ్రీరామ మహా పట్టాభిషేకం ..
శ్రీరామ నవమి తర్వాతి రోజు జరగే మహా పట్టాభిషేకం కార్యక్రమం సోమవారం ఉదయం 10.30 నుండి 12.30 గంటల వరకు జరుగింది. ఈ సందర్భంగా రామయ్యకు రాజదండం, కిరీటం, శంఖం, చక్రం, ఛత్రం, రాజముద్రిక వంటి రాజా అలంకరణలు సమర్పించబడ్డాయి. భద్రాచలం దేవస్థానం ఈ ఉత్సవానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడంతో పాటు, రాత్రి రథోత్సవం కూడా వైభవంగా జరగనుంది.
అధికారుల సమూహం – భక్తుల పారవశ్యం
ఈ పవిత్ర వేడుకల్లో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. టీటీడీ తరఫున చైర్మన్ బీఆర్ నాయుడు పట్టు వస్త్రాలను సమర్పించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ ఉత్సవాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు









