మణుగూరు ఏరియా ఆసుపత్రిని150 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలి

మణుగూరు ఏరియా ఆసుపత్రిని 100 పడకల నుంచి 150 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలి.

గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని  30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)గా ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

 

గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ / పినపాక నియోజకవర్గ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహని ఈ రోజు (శుక్రవారం)  హైదరాబాద్‌లో కలిసి వినతి పత్రాలను అందజేసిన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మణుగూరు ఏరియా ఆసుపత్రిలో రోజురోజుకూ పెరుగుతున్న రోగుల సంఖ్య, 130 శాతానికి పైగా పడకల వినియోగం, వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల తీవ్రత, గిరిజన ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవల అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

 

ప్రస్తుతం 100 పడకలతో కొనసాగుతున్న మణుగూరు ఏరియా ఆసుపత్రిని 150 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసి అదనంగా 50 పడకల వార్డును ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో అత్యవసర వైద్యం, ఐసీయూ సేవలు, ప్రమాద బాధితులకు తక్షణ చికిత్సతో పాటు గిరిజన, పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు.

 

అదేవిధంగా పినపాక నియోజకవర్గంలోని గుండాల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)గా తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో ఏర్పాటు చేయాలని మరో వినతిపత్రం ద్వారా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గుండాల మండలం పూర్తిగా గిరిజన, అటవీ ప్రాంతం కావడం, సమీప ఏరియా ఆసుపత్రులు 60 నుంచి 78 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో గుండాలలో సీహెచ్‌సీ ఏర్పాటు అత్యవసరమని కోరారు.

 

అలాగే ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పినపాక నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCs), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (CHCs) మరియు ఇతర ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు అవసరమైన మందులు, వైద్య సిబ్బంది, మౌలిక సదుపాయాలు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

 

ఈ రెండు వినతిపత్రాలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సానుకూలంగా స్పందిస్తూ, మణుగూరు ఏరియా ఆసుపత్రి అప్‌గ్రేడేషన్, గుండాలలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనలను ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram