కుల బహిష్కరణకు గురైన వ్యక్తి అంత్యక్రియల్లో పాడె మోయడానికి ముందుకు రాని గ్రామస్థులు.
ప్రాణాలు పోయినా పట్టింపే ముఖ్యం
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంట గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది.కందనకుంట గ్రామానికి చెందిన ఎదుల రాజేశం కుటుంబాన్ని గత కొంతకాలంగా గ్రామ పెద్దలు కుల బహిష్కరణ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఎదుల రాజేశం అనారోగ్యంతో మృతి చెందాడు. సాధారణంగా గ్రామంలో ఎవరైనా మృతి చెందినట్లు తెలిస్తే ఇరుగుపొరుగు, కులస్థులు వచ్చి అంత్యక్రియల్లో సాయం చేయడం ఆనవాయితీ. కానీ.. ఈ కుటుంబంపై ఉన్న బహిష్కరణ వేటు కారణంగా గ్రామస్థులు ఎవరూ రాజేశం మృతదేహాన్ని ముట్టుకోవడానికి కూడా ముందుకు రాలేదు.
కడచూపు చూసేందుకు కానీ.. పాడె మోసేందుకు కానీ ఎవరూ రాకపోవడంతో ఆ కుటుంబం తీవ్ర మాస్టాపానికి గురైంది. పుట్టడు దుఃఖంలోనూ.. చేసేదేమీ లేక రాజేశం భార్య, కుమారులు,ఇతర కుటుంబ సభ్యులే స్వయంగా పాడెను భుజాన వేసుకున్నారు. ఊరేగింపుగా మృతదేహాన్ని శ్మశానానికి తరలించారు. ఒక వ్యక్తి మరణించిన వేళ సానుభూతి చూపాల్సింది పోయి.. ఇలా అమానవీయంగా వ్యవహరించడం స్థానికంగా కలకలం రేపింది.
అతని మృతదేహాన్ని ముట్టుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో, పాడె మోసిన భార్య, అక్కలు, సొంత కుటుంబసభ్యులు ఈ విషాదకర దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో సమాజంలోని వివక్షపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. చట్టం ప్రకారం కుల బహిష్కరణ నేరమని తెలిసినా.. క్షేత్రస్థాయిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం శోచనీయం. నేటి ఆధునిక కాలంలో టెక్నాలజీ పెరుగుతున్నంత వేగంగా మనుషుల్లోని మానవత్వం మాత్రం పెరగడం లేదు. విజ్ఞానంతో మనిషి చంద్రుడిని చేరుకుంటున్నాడే తప్ప, సాటి మనిషి గుండెల్లో చూడు సంపాదించుకోలేకపోతున్నాడు.
Post Views: 40









