మెరిసేదంతా బంగారం కాదు: రోల్డ్ గోల్డ్

గోల్డ్ మ్యాన్ కాదు… అంతా రోల్డ్ గోల్డ్ 

పాతబస్తీ వ్యక్తి సూర్యాభాయ్ అసలు బండారం బట్టబయలు

ఐటీ విచారణలో షాకింగ్ నిజాలు వెల్లడి

 

పాతబస్తీకి చెందిన సూర్యాభాయ్ అలియాస్ పల్లపు సురేశ్ కుమార్ గురించి ప్రచారంలో ఉన్న గోల్డ్ మ్యాన్ ఇమేజ్ అసలు నిజం కాదని ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ విచారణలో బట్ట బయలు అయింది. బంగారం ధరించి ధనవంతుడిగా కనిపించిన ఆయన వాస్తవానికి నకిలీ ఆభరణాలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించినట్లు అధికారులు వెల్లడించారు.

 

విచారణలో భాగంగా సూర్యాభాయ్ ధరించే ఆభరణాలను పరీక్షించిన అధికారులు, అవన్నీ రాగితో తయారు చేసి వాటిపై రోడియం పూత వేసినవేనని గుర్తించారు. ఈ ఆభరణాల మొత్తం విలువ కేవలం రూ.3 లక్షలు మాత్రమేనని నిర్ధారించారు. అయితే ఒక ఆభరణానికి మాత్రమే వెండిపై బంగారు పూత వేసినట్లు తేలింది.

 

సూర్యాభాయ్ సుమారు 32 రకాల నకిలీ ఆభరణాలను ఉపయోగించి ధనవంతుడిగా కనిపించే ప్రయత్నం చేసినట్లు ఐటీ అధికారులు పేర్కొన్నారు. ప్రజల్లో గుర్తింపు పొందడం, సినిమా అవకాశాలు రావాలనే ఉద్దేశంతోనే ఇలా “గోల్డ్ మ్యాన్”గా ప్రచారం చేసుకున్నానని విచారణలో ఆయన అంగీకరించినట్లు సమాచారం.

 

అంతేకాకుండా, సూర్యాభాయ్‌కు సొంత ఇల్లు కూడా లేకుండా, నెలకు రూ.20 వేల కిరాయికి అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గత ఆరేళ్లుగా ఆయన ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయకపోవడం కూడా విచారణలో బయటపడింది. కేవలం 2022–23 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే రూ.4.9 లక్షల ఆదాయం చూపినట్లు రికార్డులు వెల్లడించాయి.

 

ఈ విషయాలు కొండా విజయ్ కుమార్ అనే వ్యక్తిపై జరుగుతున్న ఐటీ శాఖ విచారణలో భాగంగా వెలుగులోకి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఘటనతో గోల్డ్ మ్యాన్ పేరుతో ప్రసిద్ధి చెందిన సూర్యాభాయ్ అసలు నిజాలు బయటపడటంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.

 

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram