24 గంటల్లో పూర్తిస్థాయిలో పరిశుభ్రత చర్యలు చేపట్టాలి
ఇందిరమ్మ ఇండ్ల సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్
గోల్డెన్ న్యూస్ /అశ్వాపురం /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం విస్తృతంగా పర్యటించి పాఠశాలలు ఇందిరమ్మ ఇండ్ల సర్వే పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా అశ్వాపురం మండలం గొందిగూడెం గిరిజన ఆశ్రమ గురుకుల బాలుర పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కంప్యూటర్ ల్యాబ్, తరగతి గదులు, వసతి గృహాలు, వంటశాల, పాఠశాల ఆవరణను పరిశీలించారు.
కంప్యూటర్ ల్యాబ్‌లో కంప్యూటర్లు దుమ్ము, ధూళితో అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగు నెలల క్రితం పాఠశాల సందర్శన సందర్భంగా ఇదే అంశంపై సూచనలు చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను సక్రమంగా నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. ఈ విషయమై సంబంధిత సీటీవోతో ఫోన్లో మాట్లాడి కంప్యూటర్ ఇన్స్పెక్టర్ కాంట్రాక్టును రద్దు చేయాలని ఆదేశించారు.
అనంతరం ప్రధానోపాధ్యాయుని గది, వంటశాలను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు వడ్డించటానికి సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించి,ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించడం లేదని గుర్తించి హాస్టల్ వార్డెన్‌ను వివరణ కోరారు. విద్యార్థుల సంఖ్య ఎంత ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. వసతి గృహాలను తనిఖీ చేసిన సందర్భంగా అక్కడ కూడా పరిశుభ్రత లోపాలను గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు, సిబ్బందితో మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయుని గది మినహా పాఠశాలలోని మిగతా అన్ని ప్రాంతాల్లో పరిశుభ్రత లోపించిందని అసహనం వ్యక్తం చేశారు . పాఠశాల ఆవరణ, తరగతి గదులు, వసతి గృహాలు, వంటశాల తదితర ప్రాంతాల్లో 24 గంటల్లో పూర్తిస్థాయిలో పరిశుభ్రత చర్యలు చేపట్టి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పరిశుభ్రత లోపాలు, మెనూ అమలులో నిర్లక్ష్యంపై హాస్టల్ వార్డెన్‌కు మెమో జారీ చేయాలని ఆదేశించారు.
కొత్తూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటించి వారి విద్యాభ్యాసం, మధ్యాహ్న భోజన నాణ్యత, మెనూ అమలుపై వివరాలు తెలుసుకున్నారు. ఇటీవల పాఠశాలలో చేరిన విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకుని, హాజరు నమోదును యాప్ ద్వారా పరిశీలించారు. విద్యార్థుల హాజరును ప్రతిరోజూ సక్రమంగా నమోదు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు .
అనంతరం అశ్వాపురం మండలం ఎలకలగూడెం గ్రామంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి చేపడుతున్న సర్వే విధానం, దరఖాస్తుల పరిశీలన, యాప్ ద్వారా వివరాల నమోదు తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి కుటుంబాన్ని గుర్తించి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వివరాలను నమోదు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి సర్వే నిర్వహించాలని, అర్హత కలిగిన ఏ ఒక్క కుటుంబం కూడా సర్వేకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. యాప్‌లో నమోదు చేసే వివరాలు ఖచ్చితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు నమోదైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ధృవీకరించాలని సూచించారు.
సర్వే పురోగతిని ఎంపీడీవో జిల్లా కలెక్టర్‌కు వివరించారు. అశ్వాపురం మండలంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం మొత్తం 3,448 దరఖాస్తులు ఎల్-1 స్థాయిలో ఉన్నాయని, వాటిలో 2,075 దరఖాస్తుల సర్వే పూర్తయిందని తెలిపారు. మండలంలో ఇప్పటివరకు 409 గుడిసెలను గుర్తించినట్లు వివరించారు. మిగిలిన దరఖాస్తుల సర్వేను కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట అశ్వాపురం ఎంపీడీవో, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.









