లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్

గోల్డెన్ న్యూస్ / సిద్దిపేట / సిద్దిపేట జిల్లా చేర్యాల మండల తహసీల్దార్ కొర్ర దిలీప్ నాయక్ అవినీతి ఏసీబీ అధికారులకు చిక్కారు. ఆదివారం (జూలై 6) మధ్యాహ్నం 2:40 గంటల సమయంలో తన కార్యాలయంలోనే ఫిర్యాదుదారుడి నుంచి రూ.70 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు.

 

ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. నాగపురి గ్రామానికి చెందిన సర్వే నంబర్లు 833/B, 833/C, 833/D, 833/E, 834/B, 834/C, 834/D, 834/E పరిధిలోని మొత్తం 30 గుంటల భూమికి సంబంధించిన 11 నాలా కన్వర్షన్ దరఖాస్తులను ప్రాసెస్ చేసి అధికారిక అనుమతులు మంజూరు చేయడానికి తహసీల్దార్ లంచం డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఈ దరఖాస్తుల్లో ఇప్పటికే 8 దరఖాస్తులు ప్రాసెస్ చేయగా, మిగిలిన ప్రక్రియ పూర్తి చేయడానికి రూ.70 వేల లంచం కోరినట్లు విచారణలో తేలింది. ఈ భూములు జమున కనకమ్మతో పాటు మరికొందరి పేర్లపై ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఫిర్యాదుదారుడి సమాచారం మేరకు పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంలోనే రూ.70 వేల లంచం స్వీకరిస్తున్న సమయంలో దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం ఆయన వద్ద నుంచి లంచం నగదును స్వాధీనం చేసుకున్నారు.

 

ప్రభుత్వ ఉద్యోగిగా తన విధులను నిజాయితీగా నిర్వర్తించాల్సిన తహసీల్దార్, అధికారిక పనిని చేయడానికి అక్రమంగా లంచం డిమాండ్ చేసి స్వీకరించడం ద్వారా అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ పేర్కొంది.

 

ఈ కేసులో తహసీల్దార్‌ను అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు వెల్లడించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram