గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ / పార్టీ ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్యేలపై వేటు వేయడానికి నిరాకరించిన స్పీకర్ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి, ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి ఆయన నిరాకరించారు. సదరు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు తగిన ఆధారాలు లభించలేదని ఈ సందర్భంగా స్పీకర్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, టి. ప్రకాష్ గౌడ్‌లకు పెద్ద ఉపశమనం లభించింది. వీరు కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారని స్పీకర్ కార్యాలయం పేర్కొంది. బీఆర్ఎస్ నాయకులు వీడియోలు, డాక్యుమెంటరీ ఆధారాలు సమర్పించినప్పటికీ, సాంకేతికంగా ఫిరాయింపు రుజువు కాలేదని తేల్చడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది.









