మెనూ ఉల్లంఘనపై ఆగ్రహం – గిరిజన సంక్షేమ పాఠశాల హెచ్ఎం, వార్డెన్‌కు షోకాజ్ నోటీసులు జారీకి ఆదేశించిన జిల్లా కలెక్టర్ అంకిత్
గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం / అశ్వాపురం మండలంలో గురువారం జిల్లా కలెక్టర్ అంకిత్ విస్తృతంగా పర్యటిస్తూ విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయ రంగాలకు సంబంధించిన పలు కార్యక్రమాలను సమీక్షించారు. ప్రజలకు అందుతున్న సేవలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ, సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
మొదటగా మల్లెలమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ విధానం, ప్రశ్నపత్రాల పంపిణీ, భద్రతా ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను సమగ్రంగా పరిశీలించారు. పరీక్షలు పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిర్వహించాలనీ, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. కేంద్రంలో తాగునీరు, విద్యుత్, శౌచాలయాల వంటి ప్రాథమిక సదుపాయాలను తనిఖీ చేసి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కేంద్రంలో మొత్తం 110 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, ఒకరు గైహాజరైనట్లు అధికారులు తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఇన్విజిలేటర్లు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు .
అశ్వాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ
అనంతరం అశ్వాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, మందుల గది, ల్యాబ్, ఇన్‌పేషెంట్, ఔట్‌పేషెంట్, వ్యాక్సినేషన్ విభాగాలను పరిశీలించారు. ఔషధాల నిల్వలు, ఎక్స్పైరీ తేదీలను నిశితంగా తనిఖీ చేసి, రోగులతో మాట్లాడి అందుతున్న సేవలపై సమాచారం సేకరించారు. ఒక రోగితో మాట్లాడిన సందర్భంగా, సరైన ఆహారం, వైద్యుల సూచనలు పాటించడం ద్వారా షుగర్‌ను నియంత్రించుకోవచ్చని సూచించారు. సిబ్బంది హాజరు, రికార్డుల నిర్వహణ, అత్యవసర సేవల అమలుపై కూడా సమీక్షించి, ప్రజలకు నిరంతర, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ
ఈ పర్యటన లో భాగంగా అశ్వాపురం మండలం గొందిగూడెం ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్, పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం బయటపడింది. నిర్దేశిత మెనూ ప్రకారం ఇవ్వాల్సిన క్యారెట్, ఎగ్ ఫ్రై అందించకపోవడాన్ని గమనించిన కలెక్టర్, “విద్యార్థులకు అందించే ఆహారంలో ఎలాంటి రాజీ ఉండకూడదు” అని స్పష్టం చేశారు. మెనూ పాటించకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాఠశాల కిచెన్, కూరగాయల నిల్వ గది, స్టోర్ రూమ్‌ను పరిశీలించారు.కంప్యూటర్ ల్యాబ్‌లో శుభ్రత లేమి, మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రభావం పడే అంశాలను అత్యంత ప్రాధాన్యతతో చూడాలని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో పాఠశాల హెడ్మాస్టర్ రామారావు మరియు వార్డెన్‌పై నిర్లక్ష్యానికి సంబంధించి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని, ఒక రోజు వేతనం కోత విధించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలలో నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేస్తూ, జిల్లాలోని అన్ని సంక్షేమ పాఠశాలల్లో మెనూ, పరిశుభ్రత, మౌలిక వసతుల అమలుపై అధికారులు కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. విద్యార్థుల సంక్షేమం విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
అనంతరం నెల్లిపాక బంజర గ్రామంలోని జెఎన్జె అగ్రి ఫారంను సందర్శించిన కలెక్టర్, రైతులు విజయనిర్మల – క్రీస్తు రాజు దంపతులు సాగు చేస్తున్న ఆపిల్ బేర్, మల్బరీ తోటలను పరిశీలించారు. రైతులు తమ సాగు విధానాన్ని వివరించగా, కలెక్టర్ అభినందించారు. సాంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన పంటల సాగు ద్వారా రైతులు ఆదాయం పెంచుకోవాలని సూచించారు. డ్రిప్ ఇరిగేషన్, నేరుగా మార్కెటింగ్ వంటి ఆధునిక విధానాలను ప్రోత్సహించాలని అధికారులకు ఆదేశించారు.
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి ఇంతియాజ్ ఖాన్, ప్రధానోపాధ్యాయులు గోపి వరప్రసాద్, మెడికల్ అధికారి సంకీర్తన, ఏఈవో రమ్యశ్రీ, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










