లక్ష రూపాయలకు బిడ్డను అమ్ముకున్న తల్లిదండ్రులు
గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్ / ఆర్థిక సమస్యల ముందు కన్నవారి ప్రేమ ఓడిపోయింది. ఆ తల్లిదండ్రులకు ఏం కష్టమొచ్చిందో పేగు తెంచుకొని పుట్టిన బిడ్డని అంగట్లో పశువులా అమ్మకానికి పెట్టారు. మహబూబ్ నగర్ జిల్లాలోని తెలుగుగూడెం గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. తెలుగుగూడెం గ్రామానికి చెందిన కేశవులు, నీలమ్మ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత నెల 16వ తేదీ నీలమ్మ మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మరో మగ శిశువుకు జన్మనిచ్చింది. కొద్ది రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి తల్లీబిడ్డ డిశ్చార్జ్ అయ్యారు.
సాధారణంగా గ్రామంలో శిశువు జన్మిస్తే అంగన్ వాడీ కేంద్రానికి, స్థానిక ఆస్పత్రికి సమాచారం అందుతుంది. ఈ క్రమంలో జూలై 13వ తేదీన స్థానిక ఆస్పత్రి సిబ్బంది నీలమ్మ కొడుక్కి ఓ టీకా వేయడానికి ఇంటికి వెళ్లారు. అయితే ఇంట్లో శిశువు కనిపించలేదు. దీంతో గ్రామ సర్పంచ్ కు సమాచారం అందించారు. సర్పంచ్, ఇతర గ్రామ పెద్దలు నీలమ్మ, కేశవులును శిశువు గురించి ప్రశ్నించగా చనిపోయాడని వారు సమాధానమిచ్చారు. అక్కడున్న వాళ్లందరికీ వాళ్లిద్దరూ ఏదో విషయం దాస్తున్నారని అనుమానం కలిగింది.
దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు తెలుగుగూడెం గ్రామానికి చేరుకున్నారు. ఐసీడీఎస్ అధికారులు దంపతులిద్దరినీ తమ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించారు. చివరకు శిశువును అమ్మేసినట్లు వారు ఒప్పుకున్నారు. ఓ మధ్యవర్తి ద్వారా రూ.లక్షకు హన్వాడ మండలం మొనిమోక్షం గ్రామానికి చెందిన వ్యక్తులకు శిశువును అమ్మినట్లు తెలిపారు. దీంతో అధికారులు సదరు మధ్యవర్తి, శిశువును కొనుక్కున్న వారి వివరాలు సేకరించి విచారణ జరుపుతున్నారు.









