అక్టోబర్ నుంచే పంపిణీకి ప్రభుత్వం కసరత్తు.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు
హైదరాబాద్ : కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్ నెలలో కొత్త పింఛన్ల పంపిణీని ప్రారంభించి, సాధ్యమైనంతవరకు దసరా పండుగకు ముందే అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.
కొత్త పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. వెరిఫికేషన్‌లో ఎలాంటి జాప్యం జరగకుండా అవసరమైన చోట అదనపు సిబ్బందిని వినియోగించుకోవాలని ఆదేశించారు. మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా చర్యలు తీసుకోవాలని SERP CEO దివ్యా దేవరాజన్‌కు సూచించారు.
ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రాధాన్యత
కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో పూర్తి అర్హతలు ఉన్న ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. అర్హత కలిగిన ప్రతి దరఖాస్తుదారుడికి పారదర్శకంగా పింఛన్ మంజూరు చేసేలా ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
వెరిఫికేషన్ ప్రక్రియ ముమ్మరం
కొత్త పింఛన్ల కోసం ఇప్పటికే భారీ సంఖ్యలో దరఖాస్తులు స్వీకరించగా, వాటి పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ప్రభుత్వం అర్హుల గుర్తింపు, ధ్రువీకరణ, లబ్ధిదారుల తుది జాబితా తయారీ, పింఛన్ల మంజూరు ప్రక్రియపై దృష్టి సారించింది.
దసరాకు ముందే కొత్త పింఛన్..?
అక్టోబర్‌లో కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుండటంతో పింఛన్ కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారుల్లో ఆశలు పెరిగాయి. దసరా పండుగకు ముందే పింఛన్ అందితే తమ కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుందని లబ్ధిదారులు ఆశిస్తున్నారు.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా వెరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసి, దసరా నాటికి వీలైనంత త్వరగా పింఛన్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.








