వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు సమ్మక్క–సారలమ్మ పేరు పెట్టాలి

ఆదివాసీల ఆత్మగౌరవానికి, వీరత్వానికి ప్రతీకలైన సమ్మక్క–సారలమ్మలకు గౌరవం దక్కాలి

ప్రభుత్వం వెంటనే కేంద్రానికి ప్రతిపాదన పంపాలి

 తుడుం దెబ్బ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి పోలేబోయిన వెంకటనారాయణ

 

కరకగూడెం : తెలంగాణలో నిర్మితమవుతున్న వరంగల్ విమానాశ్రయానికి ఆదివాసీ వీరనారీమణులు సమ్మక్క–సారలమ్మ  పేరును పెట్టాలని తుడుందెబ్బ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి పోలేబోయిన వెంకటనారాయణ డిమాండ్ చేశారు. సమ్మక్క–సారలమ్మలు కేవలం ఆధ్యాత్మికంగా ఆరాధించబడే దేవతలు మాత్రమే కాదని, ఆదివాసీ సమాజ ఆత్మగౌరవం, ధైర్యం, త్యాగం, హక్కుల పరిరక్షణకు ప్రతీకలుగా నిలిచిన చారిత్రక మహిళా ప్రతిరూపాలు అని ఆయన పేర్కొన్నారు. తమ ప్రజల హక్కులు, స్వాభిమానం కోసం ప్రతిఘటించిన వారి వీరత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తోందన్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర నేడు తెలంగాణ సరిహద్దులు దాటి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, ఈ జాతర ద్వారా ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రపంచానికి పరిచయమవుతున్నాయని తెలిపారు. వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు సమ్మక్క–సారలమ్మ పేరు పెట్టడం కేవలం పేరు మార్చే అంశం కాదు. ఇది ఆదివాసీ చరిత్రకు ఇచ్చే గౌరవం. ఆదివాసీ త్యాగాలకు ఇచ్చే గుర్తింపు. తెలంగాణ గడ్డకు, సమ్మక్క–సారలమ్మల వీరత్వానికి లభించే గౌరవం అని వెంకటనారాయణ అన్నారు. గతంలో మేడారంలో గద్దెల నూతన నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సమ్మక్క–సారలమ్మల సాంస్కృతిక ప్రాధాన్యతను మరింతగా ప్రతిబింబించే ప్రయత్నాలు జరిగాయని గుర్తుచేశారు. అదే విధంగా వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు సమ్మక్క–సారలమ్మల పేరు పెట్టడం ద్వారా తెలంగాణ ఆదివాసీ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించే అవకాశం ఉందన్నారు. విమానాశ్రయానికి వచ్చే దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు సమ్మక్క–సారలమ్మల చరిత్ర, ఆదివాసీ జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకునే అవకాశం కల్పించేలా విమానాశ్రయ ప్రాంగణంలో సాంస్కృతిక ప్రదర్శనశాల ఏర్పాటు చేయాలని కూడా ఆయన సూచించారు. ప్రభుత్వం ఆదివాసీ సమాజ భావోద్వేగాలను, చారిత్రక వారసత్వాన్ని గౌరవించి వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు ‘సమ్మక్క–సారలమ్మ విమానాశ్రయం’గా పేరు పెట్టే నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. సమ్మక్క–సారలమ్మల వీరత్వం ఆదివాసీలకు ఆత్మగౌరవానికి ప్రతీకగా, వారి త్యాగం హక్కుల పరిరక్షణకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఈ సందర్బంగా పోలేబోయిన వెంకటనారాయణ ప్రభుత్వనికి విజ్ఞప్తి చేశారు..

Facebook
WhatsApp
Twitter
Telegram