అర్హులైన గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి.
పోడు సాగుదారులపై ఫారెస్ట్ వారి దాడులను ఆపుటకు తగిన చర్యలు తీసుకోవాలి.
సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి.
గోల్డెన్ న్యూస్ / మణుగూరు / ఏజెన్సీలోని గిరిజనేతర పేదల భూములకు రక్షణ కల్పించాలని, అర్హులైన గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, పోడు సాగుదారుల పై ఫారెస్ట్ వారి దాడులను ఆపుటకు తగిన చర్యలు తీసుకోవాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆదివారo మణుగూరులోని ఇల్లందు గెస్ట్ హౌస్ లో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ అండ్ గృహ నిర్మాణ శాఖామాత్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీలోని గిరిజనేతర పేదలు అనేక దశాబ్దాలుగా గిరిజనులతో కలిసి మెలసి ఉంటూ, వారికి ఉన్నటువంటి కొద్దిపాటి ప్రభుత్వ భూముల పై ఆధారపడి వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారని, గతంలో ఇట్టి భూములకు ,ప్రభుత్వం భూమిశిస్తులు కట్టించుకుంటూ ఉండేదని, భూమి శిస్తుల ఆధారంగా సహకార బ్యాంకులో వారికి రుణాలు కూడా మంజూరు చేసేదని, ఆ రుణాల సహకారంతో రైతులు వ్యవసాయం చేసుకునే వారని అన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంటులో ప్రత్యేక రికార్డులు కూడా ఉండేదన్నారు. దీంతో గిరిజనేతర పేదలకు ఒక భరోసా ఉండేది అన్నారు. కానీ గత కొంతకాలంగా ఇవన్నీ బంద్ చేయడం వలన వారి భూములకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు అన్నారు. ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి పెట్టి వారికి భరోసా కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ఏజెన్సీ లోని అర్హులైన గిరిజనులందరికీ పోడు భూములకు పట్టాలిచ్చి, ఏజెన్సీలోని పోడు సాగుదారులకు, ఫారెస్ట్ వారికి మధ్య జరుగుతున్న వివాదాలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనికి మంత్రి గారు స్పందిస్తూ ఈ సమస్యలపై తప్పనిసరిగా దృష్టి పెట్టి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. మంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.









