ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ

ఆస్పత్రికి వచ్చే రోజులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి జిల్లా కలెక్టర్ అంకిత్ 

 

 

గోల్డెన్ న్యూస్/లక్ష్మీదేవి పల్లి / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి వైద్యులు, సిబ్బంది విధుల్లో ఉన్నారా లేదా అని తనిఖీ చేశారు.  జ్వర కేసులు, రక్త పరీక్షలు, మందుల నిల్వలు, పరిశుభ్రతపై సమగ్ర పరిశీలన నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి రోగికి సకాలంలో నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు, వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని  అన్నారు.  అధికారులకు పలు సూచనలు చేశారు. ఆసుపత్రిలోని ప్రతి వార్డును సందర్శించి పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణ, వార్డులు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని, రోగులు ఆసుపత్రికి వచ్చిన నాటి నుంచే ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.అనంతరం వైద్యాధికారితో మాట్లాడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నమోదవుతున్న ఓపీ వివరాలు, రోజువారీ రోగుల సంఖ్య, గత పది రోజులుగా నమోదైన జ్వర కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జ్వరాలపై ప్రత్యేక అప్రమత్తతతో వ్యవహరించాలని, జ్వర లక్షణాలతో వచ్చే ప్రతి రోగికి అవసరమైన పరీక్షలు నిర్వహించి తక్షణమే చికిత్స అందించాలని సూచించారు. గ్రామాల్లో జ్వరాల నివారణకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలను కూడా విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు.  సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.మందుల నిల్వ గదిని సందర్శించిన జిల్లా కలెక్టర్ అందుబాటులో ఉన్న మందుల నిల్వలు, వాటి గడువు తేదీలు, అవసరమైన మందుల లభ్యతను పరిశీలించారు. మందుల కొరత ఏర్పడకుండా ముందస్తుగా ఇండెంట్లు పంపించి అవసరమైన మందులను నిల్వ ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. పాము కాటుకు గురైన బాధితులకు అత్యవసరంగా వినియోగించే యాంటీ స్నేక్ వెనం ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట లక్ష్మీదేవి పల్లి తాసిల్దార్ శిరీష, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, వైద్యులు సిబ్బంది సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram