మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.
గోల్డెన్ న్యూస్ /భద్రాచలం/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.. 43 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 10:14 గంటల సమయానికి గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
విదర్భ, ఛత్తీస్‌గఢ్, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో గత మూడు రోజులుగా కురిసిన వర్షాల వల్ల ఉపనదులైన ఇంద్రావతి, ప్రాణహితలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఇంద్రావతి నుంచి రికార్డు స్థాయిలో దాదాపు 10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో గోదావరి ప్రవాహం తీవ్రరూపం దాల్చింది. రాబోయే 24 నుంచి 36 గంటల్లో మేడిగడ్డ, భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం 12 నుంచి 17 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని వరద ముందస్తు అంచనాలు పేర్కొంటున్నాయి. SRSP, ఎల్లంపల్లి, సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టులతో పాటు భద్రాచలం వద్ద నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది.
వరద తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో భద్రాచలం సబ్ కలెక్టర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ‘గోదావరి ఫ్లడ్ మాన్యువల్’ ప్రకారం వరద నివారణ విధులు నిర్వర్తించే అధికారులందరూ తక్షణమే అప్రమత్తమై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు, సబ్ కంట్రోల్ రూమ్‌లను అందుబాటులోకి తెచ్చారు. గోదావరి తీర ప్రాంత ప్రజలు, ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.










