విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు ఒక ఫార్మసిస్ట్ సస్పెన్షన్, షోకాజ్ నోటీసులు, బదిలీ, ఇద్దరు పేషెంట్ కేర్ సిబ్బంది సేవలు తాత్కాలికంగా నిలిపివేత
గోల్డెన్ న్యూస్ /మణుగూరు/ మణుగూరు ఏరియా ఆసుపత్రిలో గడువు ముగిసిన మందులను రోగులకు అందించిన ఘటనను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అత్యంత తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ (డీసీహెచ్‌ఎస్) అధికారి డాక్టర్ రవిబాబుకు తక్షణమే సమగ్ర విచారణ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ పూర్తి చేసి సమర్పించిన నివేదిక ఆధారంగా బాధ్యులపై నేడు క్రమశిక్షణా చర్యలు చేపట్టారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఒక ఫార్మసిస్ట్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. నర్సింగ్ సూపరింటెండెంట్‌తో పాటు ఒక నర్సింగ్ ఆఫీసర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఒక సీనియర్ నర్సింగ్ ఆఫీసర్‌ను చర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు బదిలీ చేయగా, విచారణ పూర్తయ్యే వరకు ఇద్దరు పేషెంట్ కేర్ సిబ్బంది సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన వైద్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన లేదా బాధ్యతారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. వైద్య సేవల నాణ్యతను దెబ్బతీసే చర్యలకు పాల్పడిన వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిల్వ ఉంచే మందుల నాణ్యత, గడువు తేదీలు, పంపిణీ విధానం, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై అన్ని ఆసుపత్రుల అధికారులు నిరంతరం పర్యవేక్షణ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రతి స్థాయిలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ రోగులకు సురక్షితమైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడం జిల్లా యంత్రాంగం ప్రధాన లక్ష్యమని, ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగించే ఏ విధమైన నిర్లక్ష్యంపైనా రాజీ లేకుండా నిబంధనల ప్రకారం కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. జిల్లా వైద్య పరిపాలన కూడా ప్రభుత్వ వైద్య సంస్థల్లో సేవల నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపడుతుందని వెల్లడించింది.








