వెబ్ డెస్క్ : కొర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డికి తెలంగాణ హైకోర్టు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. రూ.2 వేల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. అయితే ఈ శిక్ష అమలును నాలుగు వారాల పాటు నిలిపివేస్తూ న్యాయస్థానం వెసులుబాటు కల్పించింది. జస్టిస్ కె. లక్ష్మణ్ ఈ మేరకు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ జరిపి తీర్పు వెలువరించారు. రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని సెక్షన్ 22-ఏ ప్రకారం నిషేధిత ఆస్తుల జాబితా నుంచి కొన్ని భూములను తొలగించాలంటూ బాధితులు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. దీనిపై 60 రోజుల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని 2025 ఆగస్టులో హైకోర్టు అప్పటి కలెక్టర్‌ను ఆదేశించింది. అయితే నిర్ణీత గడువులోగా కలెక్టర్ స్పందించకపోవడంతో బాధితులు 2025 అక్టోబర్ 15న కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
ధిక్కరణ పిటిషన్ దాఖలైన తర్వాతే కలెక్టర్ బాధితులకు నోటీసులు జారీ చేశారని హైకోర్టు గుర్తించింది. 2026 ఫిబ్రవరి 26న వారి వినతిని తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, జూలై 8న మరోసారి తిరస్కరణ ఉత్తర్వులు వెలువడ్డాయి. విచారణ సందర్భంగా కలెక్టర్ సమర్పించిన వివరణలోనూ, అఫిడవిట్లోనూ పొంతన లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఫిబ్రవరి 21న జరిగిన విచారణకు ఆర్డీవో, తహసీల్దార్, సంబంధిత అధికారి హాజరైనట్లు కలెక్టర్ అఫిడవిట్లో పేర్కొన్నప్పటికీ.. రికార్డుల్లో వారి సంతకాలు లేవని కోర్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో అఫిడవిట్లో పేర్కొన్న వివరాలను ‘పచ్చి అబద్ధం’గా అభివర్ణించింది.
వివాదంలో ఉన్న నాలుగు సర్వే నంబర్లలో 537ను నిషేధిత జాబితా నుంచి తొలగించి, 536, 657, 658 సర్వే నెంబర్ కొనసాగించడంపై కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఒకే తరహా భూముల
ప్రశ్నించింది. ఒకే తరహా భూముల విషయంలో భిన్నమైన నిర్ణయాలు తీసుకోవడానికి కారణమేంటని నిలదీసింది. గతంలో ఇచ్చిన న్యాయస్థానం ఆదేశాల చట్టబద్ధతను ధిక్కరణ విచారణలో ప్రశ్నించలేరని హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు గత తీర్పులను ప్రస్తావిస్తూ.. ఉత్తర్వులు సరైనవా, కాదా అనే అంశంతో సంబంధం లేకుండా వాటిని అమలు చేయాల్సిందేనని పేర్కొంది. కలెక్టర్‌కు కోర్టు ఆదేశాలపై పూర్తి అవగాహన ఉన్నప్పటికీ, తగిన అవకాశాలు ఇచ్చినా వాటిని అమలు చేయలేదని న్యాయస్థానం నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఆయన వివరణను తోసిపుచ్చుతూ ఆరు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. అయితే శిక్ష అమలును నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసింది.








