మేడారం జాతరకు 3,800 బస్సులు : మంత్రి పొన్నం ప్రభాకర్

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్‌ :  తెలంగాణలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు ఈసారి కోటి మందికి పైగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచీ భక్తులు భారీగా రానున్నారు.

 

దక్షిణాదిలో కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ఈ మహాజాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు మేడారంలో నిర్వహించబడనుంది.

 

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం జాతర ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. రోడ్ల అభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్‌ మరియు భక్తుల వసతుల కోసం ఇప్పటికే భారీ నిధులను మంజూరు చేసింది.

 

భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల రాకపోకల కోసం మొత్తం 3,800 బస్సులు నడపనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

 

గురువారం సచివాలయంలో ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతర సందర్భంగా రవాణా వ్యవస్థలో ఎలాంటి అంతరాయం లేకుండా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. మంత్రి వరంగల్ ఆర్ఎండీ, కరీంనగర్‌ జోన్‌ అధికారులతో పాటు ఆర్టీసీ సిబ్బంది, సివిల్‌ ఇంజనీర్లతో కలిసి మేడారం ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించనున్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram