గోల్డెన్ న్యూస్ / ఆంధ్రప్రదేశ్ / మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నికట్టుదిట్టమైన చట్టాలు తీసుకువస్తున్నా.. ఆడవారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. అభం శుభం తెలియని పసివాళ్లపై కూడా మృగాళ్లు తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఐదేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన శ్రీ సత్య సాయి జిల్లాలో చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ని శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల బాలికపై అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. అయితే అత్యాచారానికి యత్నించింది కూడా మైనర్ కావడం ఆందోళనను కలిగిస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం కొత్త చెరువు మండలం పరిధిలో ఓ కుటుంబానికి చెందిన ఐదేళ్ల బాలిక ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా, అక్కడే సమీపంలో ఉండే ఒక 17 ఏళ్ల బాలుడు బాలిక వద్దకు వచ్చి చాక్లెట్లు కొనిపిస్తానని నమ్మబలికాడు. అనంతరం ఐదేళ్ల చిన్నారిని తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలిక బాధతో ఉండగా తల్లి గమనించి ప్రశ్నించింది. బాలిక నుంచి సమాధానం విని అవాక్కైన తల్లి. తన కుమార్తెపై అత్యాచారం జరిగిందని తెలుసుకొని ఆవేదనకు లోనయ్యింది. విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగు వారు కూడా ఆందోళనకు గురయ్యారు. చిన్నారిపై అత్యాచారం చేయడం ఏమిటని విస్మయాన్ని వ్యక్తం చేశారు. దుర్ఘటన నుంచి తేరుకున్న బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. తమ బిడ్డకు జరిగిన ఘోరం గురించి పోలీసుల ముందు మొరపెట్టుకున్నారు. అఘాయిత్యానికి పాల్పడిన బాలుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చికిత్స నిమిత్తం బాలికను అనంతపురంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.









