గ్రామసభలతో ప్రజాపాలన ప్రజలకు చేరువవుతోంది

గ్రామసభలతో ప్రజాపాలన ప్రజలకు చేరువవుతోందిప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా గ్రామసభల నిర్వహణ

విద్య, వైద్యం, సంక్షేమంతో గ్రామాభివృద్ధి సాధ్యం.. జిల్లా కలెక్టర్ అంకిత్.

 

గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం /ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లావ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో భాగంగా అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహించిన గ్రామసభకు జిల్లా కలెక్టర్ అంకిత్ హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రగతిని ప్రజలకు వివరించడమే కాకుండా గ్రామ, వార్డు స్థాయిలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించడమే ఈ సభల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. గ్రామసభలను పండగ వాతావరణంలో నిర్వహించేలా ప్రభుత్వం యంత్రాంగానికి మార్గదర్శకాలు జారీ చేసినట్లు చెప్పారు.

 

ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి అవగాహన కల్పించే వేదికగా ఈ గ్రామసభలు ఉపయోగపడతాయని అన్నారు . ముఖ్యంగా రైతుభరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, సన్నరకం వడ్లకు బోనస్, చేయూత పింఛన్లు, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కొత్త రేషన్ కార్డుల జారీ వంటి పథకాలను గ్రామ, వార్డు స్థాయిలో విస్తృతంగా వివరిస్తున్నట్లు తెలిపారు.

 

 

త్వరలో ప్రభుత్వం అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మరియు అల్పాహారం వంటి కొత్త పథకాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు.

 

క్షేత్రస్థాయిలో పథకాల అమలులో పారదర్శకత కోసం గ్రామస్థాయిలో పెండింగ్ దరఖాస్తులు, అర్హతలు, అవసరమైన ధృవీకరణ పత్రాల వివరాలను తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు.

 

గ్రామాభివృద్ధికి విద్య ముఖ్యమని పేర్కొన్న కలెక్టర్, పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందేలా నిరంతర పర్యవేక్షణ అవసరమని తెలిపారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలన్నారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు గ్రామసభల్లో పాల్గొని సమస్యలను చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.

 

వైద్య సేవల ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు.

 

అశ్వాపురం గ్రామంలో అమలు చేసిన పథకాల వివరాలను వెల్లడిస్తూ,రైతు భరోసా కింద 1,369 మందికి రూ. 2.34 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లు కింద 58 మందికి రూ. 2.90 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా రూ. 75.58 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపారు .

 

గ్యాస్ సబ్సిడీ కింద 1,000 మందికి రూ. 20.11 లక్షలు, చేయూత పింఛన్ల ద్వారా 803 మందికి రూ. 19.33 లక్షలు అందించినట్లు తెలిపారు. గృహజ్యోతి పథకం ద్వారా 1,156 మంది లబ్ధి పొందినట్లు చెప్పారు.

 

కళ్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ కింద 153 మందికి రూ. 82.09 లక్షలు, 1,235 రేషన్ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా రూ. 585.69 లక్షలు, వడ్డీ లేని రుణాలుగా రూ. 28.14 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు .

 

ఈ కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాల లబ్ధిదారుల పేర్లను సభలో చదివి వినిపించి, వాటి అమలుపై ప్రజల అభిప్రాయాలను స్వీకరించారు.

 

గ్రామసభల్లో స్థానిక సమస్యలపై చర్చించి, ప్రాధాన్యత క్రమంలో వాటి పరిష్కారానికి తీర్మానాలు చేయాలని సూచించారు. ఈ వివరాలను ప్రత్యేక రిజిస్టర్లలో నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదించాలన్నారు.

 

గ్రామస్థాయిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో ప్రత్యేక ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ సవర్లాల్, ఉప సర్పంచ్ తుళ్లూరు ప్రకాష్, , మండల ప్రత్యేక అధికారి ఇంతియాజ్ ఖాన్, ఎంఈఓ వీరాస్వామి, తాసిల్దార్, అన్ని శాఖల అధికారులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram