బీడీ ఆకుల కోసం వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి- నలుగురు మృతి

మహారాష్ట్ర అటవీ ప్రాంతంలో పులి బీభత్సం.. తునికాకు కోసం వెళ్లిన నలుగురు మహిళలు మృతి..!

 

 

మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని చంద్రపూర్ జిల్లా సిండేవాహి తాలూకా పరిధిలోని గుంజవాహి–పవన్‌పార్ అటవీ ప్రాంతంలో తునికాకు (తెండు ఆకులు) సేకరించేందుకు వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి చేయడంతో నలుగురు మహిళలు దారుణంగా మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుని స్థానికంగా తీవ్ర భయాందోళనలకు దారితీసింది.

 

సమాచారం ప్రకారం, గ్రామానికి చెందిన సుమారు 13 మంది మహిళలు ఉదయం అడవికి తునికాకు సేకరణ కోసం వెళ్లారు. కొంతసేపటి తరువాత మహిళల బృందంపై ఒక్కసారిగా పులి దాడి చేసింది. ఘటన అనంతరం 9 మంది మహిళలు మాత్రమే గ్రామానికి తిరిగి చేరుకోగా, నలుగురు కనిపించకపోవడంతో గ్రామస్థులు, అటవీశాఖ సిబ్బంది కలిసి గాలింపు చేపట్టారు. అనంతరం అటవీ ప్రాంతంలో నలుగురు మహిళల మృతదేహాలను గుర్తించారు.

 

ఘటన సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసులు వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించేందుకు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అలాగే పులి సంచారం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెంచి, కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 

ఇటీవల చంద్రపూర్ జిల్లాలో పులుల దాడులు పెరుగుతున్నాయని అటవీశాఖ గణాంకాలు సూచిస్తున్నాయి. అడవులకు ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు జీవనోపాధి కోసం అడవిలోకి వెళ్లే సమయంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram