భారీ వర్షాల హెచ్చరిక.

భారీ వర్షాల హెచ్చరిక.. హైదరాబాద్ అధికార యంత్రాంగానికి సీఎం ఏ. రేవంత్ రెడ్డి హై అలర్ట్ ఆదేశాలు

 

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ / హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని అధికార యంత్రాంగం హై అలర్ట్‌తో ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నిన్న శనివారం ఉన్నతాధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డ్‌తో పాటు ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

 

భారీ వర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కోర్ అర్బన్ రీజియన్ ప్రత్యేక కార్యదర్శి గారితో సహా సీనియర్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పరిస్థితిని సమీక్షించి అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

 

వర్షాలు కురిసిన సందర్భాల్లో నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు సత్వరం తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. వాతావరణ శాఖ సూచనల ఆధారంగా ముందస్తు ప్రణాళికతో రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేకంగా బృందాలను మోహరించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

 

అలాగే ట్రాఫిక్ అంతరాయం, విద్యుత్ సమస్యలు, తాగునీటి సరఫరా వంటి అంశాలపై సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. వర్షాల సమయంలో అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

 

ప్రజల భద్రతే ప్రాధాన్యంగా తీసుకుని అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశించారు.

 

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram