కుంజా వనజ మృతిపై డాక్టర్ రవీందర్ నాయక్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆరా
ప్రోగ్రాం అధికారులతో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష
గోల్డెన్ న్యూస్ / పాల్వంచ /భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న కుంజ వనజ మృతి ఘటనపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డా. రవీందర్ నాయక్ జిల్లాకు విచ్చేసి కుంజా వనజ మృతి సంఘటనపై సమగ్రంగా ఆరా తీశారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి డా. తుకారాం రాథోడ్, మరియు డా. రవిబాబు డి సి హెచ్ ఎస్, సంబంధిత వైద్య అధికారులు, ఆరోగ్య సిబ్బందితో సమావేశమై గర్భిణికి అందించిన వైద్య సేవలు, చికిత్స వివరాలు, రిఫరల్ ప్రక్రియ, సంఘటనకు దారితీసిన పరిస్థితులు తదితర అంశాలపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం సంబంధిత రికార్డులను పరిశీలించి, విధుల నిర్వహణలో ఎలాంటి లోపాలు జరిగాయో సమగ్రంగా విచారణ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. విచారణ నివేదికను త్వరితగతిన ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు.
తదుపరి డైరెక్టర్ డా. రవీందర్ నాయక్ జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతి, మాతా-శిశు ఆరోగ్య సేవలు, కుటుంబ నియంత్రణ, వ్యాధి నియంత్రణ కార్యక్రమాలు, అసంక్రమిత వ్యాధుల (NCD) స్క్రీనింగ్, టీకా కార్యక్రమం, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ల పనితీరు, సికిల్ సెల్ అనీమియా నియంత్రణ కార్యక్రమం, క్షయవ్యాధి నిర్మూలన, కుష్ఠు నిర్మూలన, వెక్టర్ బోర్న్ వ్యాధుల నివారణ తదితర అంశాలపై కార్యక్రమాల వారీగా సమీక్ష నిర్వహించారు.
ప్రతి కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాలను శాతానికి శాతం సాధించాలని, పెండింగ్ అంశాలను వెంటనే పూర్తి చేయాలని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
అదేవిధంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్య సంస్థల్లో గర్భిణులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, హైరిస్క్ గర్భిణులను ముందస్తుగా గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచాలని, అత్యవసర పరిస్థితుల్లో రిఫరల్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
మాతా-శిశు మరణాల నివారణకు ప్రతి ఆరోగ్య కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేయాలని, వైద్య సేవల నాణ్యతను మరింత మెరుగుపరచాలని డైరెక్టర్ డా. రవీందర్ నాయక్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో డా. తుకారాం రాథోడ్ డి ఎం హెచ్ ఓ డా. రవిబాబు డి సి హెచ్ ఎస్ డా .ప్రతాప్ ప్రోగ్రాం ఆఫీసర్ డా
ప్రసాద్ ప్రోగ్రాం ఆఫీసర్, డా. దినేష్ ప్రోగ్రాం ఆఫీసర్, మోహన్, రామ్ ప్రసాద్ , విప్లవ్ కుమార్, సలిత, శ్రీధర్ , కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు







