జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎమ్మెల్యే

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (ఐజేయు) నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 

 

గోల్డెన్ న్యూస్ /మణుగూరు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని డీవీ గ్రాండ్ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (ఐజేయు) ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి జర్నలిస్టుల సమావేశంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ,. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న సమయంలో లేదా ఇతర కారణాలతో జర్నలిస్టులు మరణిస్తే వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి ఎక్స్‌గ్రేషియా అందజేస్తోందని, ప్రమాదాలకు గురైన జర్నలిస్టులకు కూడా అవసరమైన సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

 

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ విషయంలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ, అర్హులైన ప్రతి విలేఖరికి పారదర్శకంగా అక్రిడిటేషన్ కార్డులు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర సమాచార, ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్యే  పాయం వెంకటేశ్వర్లు  తెలిపారు.

 

గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు, గృహ వసతి వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందేలా జర్నలిస్టులకు హెల్త్ కార్డుల సౌకర్యాన్ని మరింత విస్తరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు.

 

జర్నలిస్టుల సంక్షేమం కోసం మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, విలేఖరులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు  తెలిపారు. సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

 

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, జిల్లా ముఖ్య నాయకులు, ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, జర్నలిస్టులు, కార్యకర్తలు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram