గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం / పట్టణ పరిధిలోని రామవరం గోధుమ వాగు వంతెన పై ఏర్పడిన గుంతలకు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. వంతెన పై పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండటమే కాకుండా తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఈ పనులను చేపట్టారు.
మంగళవారం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ మరమ్మతు పనులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామవరం గోధుమ వాగు వంతెనపై ఏర్పడిన గుంతల కారణంగా ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నప్పటికీ జాతీయ రహదారి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. తమ బాధ్యతను విస్మరించిన కారణంగానే మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చిందని తెలిపారు.
ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యకు తాత్కాలిక పరిష్కారం కల్పించేందుకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టామని మేయర్ పేర్కొన్నారు. వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పనులను పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బోయిన విజయ్ కుమార్, కూరపాటి సుధాకర్, జి. వెంకటేశ్వర్లు, నాయకులు ఎండీ యూసుఫ్, ధర్మరాజు, పి. సత్యనారాయణ చారి తదితరులు పాల్గొన్నారు.








