గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ / తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది.. ఈ కార్డులు క్యూఆర్ కోడ్‌తో ప్రింటింగ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల్ని జిల్లాలకు పంపించారు.. 1.05 కోట్లకుపైగా కుటుంబాలకు కార్డుల్ని పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి ముహూర్తం ఖరారు చేయాల్సి ఉంది. సీఎం నిర్ణయం తీసుకోగానే రేషన్ కార్డుల్ని పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1,05,42,188కిపైగా రేషన్‌కార్డులు ఉంటే.. లబ్ధిదారుల సంఖ్య 3,39,96,239కిపైగా ఉన్నారు.
రేషన్ కార్డులను క్రెడిట్, డెబిట్ కార్డు పరిమాణంలో రూపొందించారు. కార్డుపై లబ్ధిదారుడి ఫొటో, పేరు, చిరునామాతో పాటు క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రాలు కూడా కార్డుపై ఉండనున్నట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా కాగితపు రేషన్ కార్డులకు బదులుగా స్మార్ట్ కార్డు రూపంలో రేషన్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు కార్డులకు బదులుగా ఈ స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నారు.
ఈ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ను మొబైల్తో స్కాన్ చేస్తే లబ్ధిదారుల కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఇప్పటి వరకు తీసుకున్న బియ్యం, చక్కెర, గోధుమలు తదితర రేషన్ సరుకుల వివరాలు కూడా సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో రేషన్ పంపిణీలో పారదర్శకత పెరగడంతో పాటు లబ్ధిదారులకు మరింత సౌకర్యం కలగనుంది.









