నకిలీ వైద్యులపై టీజీఎంసీ ఉక్కుపాదం

16 మంది పై కేసులు నమోదు

రిజిస్ట్రేషన్ దుర్వినియోగంపై డా. శ్రీహితకు షోకాజ్.. పరారీలో రుద్ర భాస్కర్

 

గోల్డెన్ న్యూస్ /వరంగల్/ వరంగల్ నగరంలో నకిలీ వైద్యులు, అనుమతి లేకుండా వైద్య సేవలు అందిస్తున్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్లపై తెలంగాణ వైద్య మండలి (టీజీఎంసీ) ప్రత్యేక దాడులు నిర్వహించింది. శివనగర్, కరిమాబాద్, కీర్తినగర్, కాజీపేట, ఊరుగొండ, ఊర్సు, ఫోర్ట్ వరంగల్ ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తుతో చేపట్టిన తనిఖీల్లో 16 మంది నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేసేందుకు సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందజేసింది. తనిఖీల్లో అనుమతి లేకుండా క్లినిక్‌ల నిర్వహణ, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల పేరుతో ఇన్‌పేషెంట్ సేవలు, బెడ్లు ఏర్పాటు చేసి రోగులను చేర్చుకోవడం, సెలైన్‌లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇవ్వడం, అపరిశుభ్ర వాతావరణంలో చికిత్సలు అందించడం, బయోమెడికల్ వ్యర్థాలను నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ చెత్తలో పడవేయడం వంటి తీవ్ర ఉల్లంఘనలు గుర్తించినట్లు టీజీఎంసీ వెల్లడించింది.

 

  కేసులు నమోదైన నకిలీ వైద్యులు

ఎ. రాములు – శివనగర్

కమలాకర్ – జయశ్రీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్, కీర్తినగర్

బండి రమేష్ – శ్వేత ఫస్ట్ ఎయిడ్ సెంటర్, శివనగర్

వెంకటేశ్వర్లు – వెంకటేశ్వర క్లినిక్, కీర్తినగర్

బాబురావు – శివనగర్

ఎ. రమేష్ – కావ్య ఫస్ట్ ఎయిడ్ సెంటర్, ఫోర్ట్ రోడ్

కృష్ణమూర్తి – కరిమాబాద్

టి. రాజమౌళి – విజయదుర్గ ఫస్ట్ ఎయిడ్ సెంటర్, కరిమాబాద్

శివశంకర్ – ఊర్సు

గడ్డం హరీష్ – ఊర్సు

గడ్డం శ్రీనివాస్ – ఊర్సు

ఎం. సిద్ధేశ్వర్ – జయలక్ష్మి ఫస్ట్ ఎయిడ్ సెంటర్, కరిమాబాద్

జి. రామకృష్ణ – ఫోర్ట్ వరంగల్

కుమారస్వామి – కాజీపేట

సుధాకర్ – కాజీపేట

జి. వెంకటరాములు – ఊరుగొండ

రిజిస్ట్రేషన్ దుర్వినియోగం.. వైద్యురాలికి నోటీసులు

 

కావ్య ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు ఎ. రమేష్ తన క్లినిక్‌లో నమోదిత వైద్యురాలు డా. శ్రీహిత వైద్య రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను దుర్వినియోగం చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ నేపథ్యంలో డా. శ్రీహితకు టీజీఎంసీ షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. నమోదిత వైద్యులు తమ రిజిస్ట్రేషన్‌ను ఇతరులకు వినియోగించుకునేలా ఇవ్వడం తీవ్రమైన వృత్తిపరమైన ఉల్లంఘన అని మండలి స్పష్టం చేసింది. అబార్షన్లు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నకిలీ వైద్యుడు రుద్ర భాస్కర్ తనిఖీల సమాచారం అందగానే పరారయ్యాడు. మరో నకిలీ వైద్యుడు లక్ష్మీనారాయణ కేసుల భయంతో తన క్లినిక్‌లోని బెడ్లు, వైద్య పరికరాలు, వాడిన సిరంజీలు, మందుల సీసాలు తొలగించినట్లు అధికారులు గుర్తించారు. నకిలీ వైద్యం, అనుమతి లేని క్లినిక్‌లు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల పేరుతో చట్టవిరుద్ధ వైద్య సేవలు, నమోదిత వైద్యుల పేర్లు, రిజిస్ట్రేషన్ దుర్వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని టీజీఎంసీ హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రజలు చికిత్స పొందే ముందు సంబంధిత వైద్యుడు తెలంగాణ వైద్య మండలి లేదా నేషనల్ మెడికల్ కమిషన్‌లో నమోదైన వైద్యుడేనా అని నిర్ధారించుకోవాలని, నకిలీ వైద్యుల సమాచారం ఉంటే 9154382727 నంబర్‌కు లేదా జిల్లా వైద్యాధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేసింది.

Facebook
WhatsApp
Twitter
Telegram