గోల్డెన్ న్యూస్// కరకగూడెం // పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను పట్టించుకోకుండా ఇసుక లారీలు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయన్న ఆరోపణలు స్థానికంగా ఆందోళనకు కారణమవుతున్నాయి. అధికారులు హెచ్చరించినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని స్థానికులు వాపోతున్నారు. రామంజరం నుంచి వరంగల్ వైపుకు ఇసుకను తరలిస్తున్న లారీలు ములుగు, ఏటూరునాగారం, జానంపేట, పినపాక మార్గంలో వెళ్లాల్సి ఉండగా, కొంతమంది డ్రైవర్లు తాడ్వాయి–వై జంక్షన్ మీదుగా కరకగూడెం రహదారిలో ప్రయాణిస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలతో పాటు. దుమ్ము ధూళితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించి ఇసుక లారీలను ఇటువైపు రావద్దని నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నప్పటికీ కొందరు డ్రైవర్లు ఆ హెచ్చరికలను లెక్కచేయడం లేదని స్థానికుల ఆరోపణ. దీంతో పోలీసుల చర్యలు కేవలం హెచ్చరికలకే పరిమితమవుతున్నాయా? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, అనుమతులు, వాహనాల పత్రాలు, ఇసుక రవాణా నిబంధనలను కఠినంగా పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.








