కారుకు అంత్యక్రియలు నిర్వహించి, భూమిలో పూడ్చిపెట్టిన కుటుంబం

ఒక కుటుంబం తమకు 12 ఏళ్లుగా అదృష్టాన్ని తెచ్చిపెట్టిన లక్కీ కారుకు ఏకంగా అంత్యక్రియలు నిర్వహించి, భూమిలో పూడ్చిపెట్టిన వింత ఘటన సంచలనంగా మారింది.

 

 

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ / సాధారణంగా పాత కారును అమ్మేయడం లేదా తుక్కుగా మార్చడం చూస్తుంటాం. కానీ గుజరాత్‌లోని ఓ కుటుంబం మాత్రం తమకు 12 ఏళ్లుగా అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని భావించిన కారును ఏకంగా పూజలు చేసి, తమ వ్యవసాయ క్షేత్రంలోనే పూడ్చిపెట్టింది. ఈ విచిత్రమైన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

 

గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా పాతర్సింగా గ్రామంలో ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినట్లు సమాచారం. సుమారు 12 ఏళ్లుగా తమ కుటుంబంతో అనుబంధం ఉన్న కారును ఇకపై కూడా తమతోనే ఉంచుకోవాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

కారు కోసం ఏకంగా 15 అడుగుల లోతైన గొయ్యి తవ్వించారు. అనంతరం పురోహితులను పిలిపించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రోచ్ఛారణలు, మేళతాళాల మధ్య కారును గొయ్యిలోకి దించి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో పూడ్చిపెట్టారు. ఈ కార్యక్రమానికి సుమారు 1,400 మంది బంధువులు, స్నేహితులు హాజరైన హాజరైనారు.

 

కారును పూడ్చిపెట్టే కార్యక్రమం కోసం కుటుంబం దాదాపు రూ.4 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కారు పూడ్చిన అనంతరం ఆ ప్రాంతాన్ని సమాధి మాదిరిగా ఏర్పాటు చేసి, దానిపై ఒక మొక్కను కూడా నాటారు.

 

‘కారు వచ్చిన తర్వాతే అదృష్టం కలిసొచ్చింది’

 

ఈ కారుతో తమ కుటుంబానికి ఎన్నో మంచి పరిణామాలు జరిగాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కారు తమ జీవితంలోకి వచ్చిన తర్వాత కుటుంబానికి అదృష్టం కలిసి వచ్చిందని, అందుకే ఆ అదృష్టం మరెవరికీ దక్కకూడదని భావించినట్లు తెలిపారు.

 

తమకు ఎంతో సెంటిమెంట్‌గా మారిన కారును అమ్మడం లేదా ఇతరులకు ఇవ్వడం ఇష్టం లేకపోవడంతో, పూజలు నిర్వహించి శాంతి కార్యక్రమం అనంతరం తమ వ్యవసాయ క్షేత్రంలోనే పూడ్చిపెట్టామని కుటుంబ సభ్యులు వివరించినట్లు సమాచారం.

 

అమ్రేలి ప్రాంతం వ్యవసాయం, పశుపోషణతో పాటు కాఠియావాడీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఇలాంటి సాంప్రదాయ విశ్వాసాల నేపథ్యంలో ఈ కుటుంబం కారుకు కూడా ప్రత్యేక గౌరవం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

 

కారు పూడ్చిపెట్టిన అనంతరం దానిపై మొక్క నాటడం కూడా ఈ కార్యక్రమంలో మరో ప్రత్యేకతగా నిలిచింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు, వివరాలు సామాజిక మాధ్యమాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

 

Facebook
WhatsApp
Twitter
Telegram