కొత్తగూడెం : ప్రతి మూడు రోజులకు ఒక లిఫ్ట్ పనిని పూర్తి చేసేలా వేగం పెంచాలి రాతి పనులకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ రోజువారీ లక్ష్యాలు నిర్దేశించాలి నాణ్యత, శాస్త్రోక్తత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ వద్దు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసేలా వేగం పెంచాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీరామనవమి, గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు కార్యాచరణతో పనులు నిర్వహించాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బుధవారం భద్రాచలం చేరుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందుగా శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికి వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. తదుపరి మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజులతో కలిసి మంత్రి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉత్తర ద్వారం వద్ద ఉన్న దమ్మక్క విగ్రహం ప్రాంతం నుంచి పరిశీలన ప్రారంభించి, వివిధ నిర్మాణ పనుల పురోగతి, ప్రస్తుత దశ, పూర్తికి అవసరమైన సమయం, మానవ వనరులు, నిర్మాణ సామగ్రి తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. లిఫ్టులు, స్లాబ్లు, రాతి పనులు, రహదారుల అభివృద్ధి, నిర్మాణ సామగ్రి లభ్యత, సిబ్బంది సమీకరణ, అదనపు నిధులు, సాంకేతిక సమన్వయం తదితర అంశాలపై పనుల వారీగా పురోగతిని పరిశీలించారు. ప్రతి విభాగానికి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించి, వారంవారీ ప్రణాళిక ప్రకారం పనులను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.275 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే పనులు వేగం పుంజుకున్నాయని, నిర్ణీత కాలవ్యవధిలో నాణ్యతతో పూర్తి చేసేందుకు అధికారులు సమగ్ర ప్రణాళికతో పనిచేయాలని తెలిపారు. శ్రీరామనవమికి ముందుగానే ప్రధాన పనులు పూర్తయ్యేలా రివర్స్ ప్లానింగ్ రూపొందించుకోవాలని, గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయం, మాడ వీధులు, అంతర్గత ప్రాకారం, బాహ్య ప్రాకారం తదితర ప్రాంతాల్లో చేపడుతున్న పనులను ముందుగానే పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు








