హైదరాబాద్: ఏసీబీఅధికారులు మరో అవినీతి అధికారిపై కొరడా ఝళిపించారు. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న కొండారెడ్డి శ్రీనివాస్ రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. సోమవారం (నవంబర్ 9, 2026) సిటీ రేంజ్-2 ఏసీబీ అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు.
ఏసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం.. కీసర పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నంబర్లు 180/2026, 738/2026 కేసుల్లో ఫిర్యాదుదారుడు నిందితుడిగా ఉన్నాడు. ఈ రెండు కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి, తనపై చార్జిషీట్లు దాఖలు చేసేలా చర్యలు తీసుకుంటానని చెప్పి ఎస్ఐ కొండారెడ్డి శ్రీనివాస్ ఫిర్యాదుదారుడిని రూ.2 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో ఫిర్యాదుదారుడి నుంచి రూ.2 లక్షలు స్వీకరిస్తుండగా ఏసీబీ సిటీ రేంజ్-2 అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేసి ఎస్ఐను రెడ్్యండెడ్గా పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి లంచంగా స్వీకరించిన రూ.2 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తన అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ, ప్రజా విధులను నిజాయితీగా నిర్వహించకుండా అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది. పట్టుబడిన ఎస్ఐ కొండారెడ్డి శ్రీనివాస్ ను అరెస్టు చేసి, నాంపల్లిలోని అవినీతి నిరోధక కేసుల ప్రత్యేక న్యాయస్థానం (ప్రథమ అదనపు ప్రత్యేక న్యాయమూర్తి) ఎదుట హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండు తరలించారు.
ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా ఆయన వివరాలను గోప్యంగా ఉంచినట్లు తెలిపారు.








