ఆదివాసీ జేఏసీ జాతీయ అధ్యక్షులు చందా లింగయ్య దొర.
గోల్డెన్ న్యూస్ / మణుగూరు : కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులపై యుద్ధం చేస్తుందని ఆదివాసీ జేఏసీ జాతీయ అధ్యక్షులు చందా లింగయ్య దొర అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్రెగుట్టపై 30వేల మంది భద్రత బలగాలను మొహరించి మావోయిస్టులపై యుద్ధం చేయడంతో ఆ ప్రాంత ఆదివాసిలలో అలజడి మొదలైందన్నారు.అమాయక ఆదివాసీ ప్రజలను మావోయిస్టుల పేరుతో కాల్చి చంపుతున్నారని ఆరోపించారు. ఆదివాసీలపై దాడులు చేయటం దారుణమన్నారు.అటవీ ప్రాంతంలోని సహజ వనరులను దోచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు సమాజానికి గొడ్డలి పెట్టన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణంతో సామాన్య ప్రజలు నిత్యవసర వస్తువులు తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అటవీ ప్రాంతాల నుంచి ఆదివాసీలను తరిమికొట్టాలని కుట్ర జరుగుతుందన్నారు. దీనిపై సమగ్రత దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్న అంతర్యుద్ధం ప్రజలకు ముప్పన్నారు. ఇటువంటి చర్యలు మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందన్నారు. ఇప్పటికైనా ఆపరేషన్ కాగార్ ను నిలిపివేయకపోతే భాజపా చర్యలను ఎండగడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నారాయణ, జ్యోతి బస్సు, రవి, తదితరులు పాల్గొన్నారు.









