ఎంపీఓకు ట్రాక్టర్ల తాళాలను అప్పగించిన కార్యదర్శులు
గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : గ్రామ పంచాయతీలకు నిధుల విడుదల లేక పోవడంతో నిర్వహణ భారంగా మారింది. ఇతర అభివృద్ధి పనులు, నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామపంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రతి నెలా విడుదల కావాల్సిన నిధులు రాకపోవడంతో కార్యదర్శులు జేబుల్లో నుంచి, వడ్డీలకు డబ్బులు తెచ్చి నిర్వహణ పనులు నెట్టుకొస్తుండటం వారికి భారంగా మారుతోంది. ఈ క్రమంలో కరకగూడెం మండల పరిధిలోని 16 గ్రామ పంచాయతీల కార్యదర్శులు, గ్రామ పంచాయతీల ట్రాక్టర్ల నిర్వహణ ఆర్థికంగా భారంగా మారిందని పేర్కొంటూ బుధవారం ట్రాక్టర్ల తాళాలను ఎంపీడీఓ మారుతికి అప్పగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చెత్త సేకరణ కోసం సరఫరా చేసిన ట్రాక్టర్లు ప్రస్తుతం పెద్ద మొత్తంలో నిర్వహణ ఖర్చును తెచ్చిపెడుతున్నాయని, ఇంధనం, మరమ్మతులు, డ్రైవర్ ఖర్చులతో పంచాయతీలు అప్పుల్లోకి కోరుకుపోతున్నాయని పంచాయతీల ఆర్థిక స్థితి దెబ్బతింటోంది. వ్యయభారం భరించలేని స్థితికి వచ్చామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాక్టర్ల నిర్వహణ తమ వల్ల కాకపోవడంతో తాళాలను అధికారులకు అప్పగించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 16 పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.









