మనుబోతులగూడెం ఘటనపై అశ్వాపురం రేంజ్ కార్యాలయంలో వివరణ అపోహలు, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు ఎఫ్డిఓ బాబు
గోల్డెన్ న్యూస్/ అశ్వాపురం /మణుగూరు రేంజ్ పరిధిలోని మనుబోతులగూడెం గ్రామపంచాయతీ నాగేశ్వరావు గుంపు వద్ద శుక్రవారం చోటుచేసుకున్న ఘటనపై శనివారం అశ్వాపురం రేంజ్ కార్యాలయంలో అటవీశాఖ అధికారులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్డిఓ బి. బాబు మాట్లాడుతూ ఘటనకు సంబంధించి 10 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే, సంబంధిత అధికారిపై కూడా విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు. అడవుల సంరక్షణలో ప్రజల సహకారం అత్యంత అవసరమని పేర్కొన్న ఆయన, అటవీ భూముల ఆక్రమణలు, అక్రమ కలప రవాణా, అడవుల విధ్వంసాన్ని అరికట్టేందుకు చట్టబద్ధమైన చర్యలు మాత్రమే తీసుకుంటామని స్పష్టం చేశారు. అటవీశాఖ సిబ్బంది ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారని, ఈ ఘటనపై వస్తున్న అపోహలు, తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం చేపడుతున్న హరితహారం, అటవీ పునరుద్ధరణ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతోనే అడవులను పరిరక్షించి భావితరాలకు పచ్చని తెలంగాణను అందించగలమని ఎఫ్డిఓ బాబు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మణుగూరు రేంజర్ ఉపేందర్, అశ్వాపురం రేంజర్ ఆలీ తదితరులు పాల్గొన్నారు.









