ఆదివాసీ సర్పంచుల సంఘం, గ్రీన్ ఆదివాసీ, తుడుందెబ్బ, ఆదివాసీ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో పూనెం హర్షితకు ఆత్మీయ సన్మానం.
గోల్డెన్ న్యూస్ /కరకగూడెం/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆదివాసీ ముద్దుబిడ్డ పూనెం లక్ష్మీనారాయణ కూతురు హర్షిత రాష్ట్ర స్థాయిలో క్రీడారంగంలో ప్రతిభ కనబరిచి సాధించిన విజయాన్ని గుర్తిస్తూ ఆదివాసీ సర్పంచుల సంఘం, గ్రీన్ ఆదివాసీ, తుడుందెబ్బ, ఆదివాసీ స్టూడెంట్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ.. నేటి ఆదివాసీ యువత విద్య, క్రీడలు, ఉద్యోగాలు, పరిపాలన, సాంకేతిక రంగాలు, సామాజిక సేవ తదితర అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతూ అన్ని రంగాల్లో ఎదగాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత విజయాలతో పాటు సమాజం పట్ల బాధ్యతతో ముందుకు సాగాలని, రాజ్యాంగం కల్పించిన ఆదివాసీ హక్కులు, పేసా చట్టం, అటవీ హక్కుల చట్టం, 1/70 నియంత్రణ వంటి చట్టాల పరిరక్షణలో యువత చైతన్యవంతమైన పాత్ర పోషించాలని సూచించారు.
పూనెం హర్షిత సాధించిన విజయం ప్రతి ఆదివాసీ విద్యార్థికి స్ఫూర్తిదాయకమని, గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసంతో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల విద్య, క్రీడలు, ప్రతిభాభివృద్ధికి ప్రోత్సాహం అందించాలని కోరారు.
అదేవిధంగా ఆదివాసీ యువత తమ సంస్కృతి, సంప్రదాయాలు, భాషను కాపాడుకుంటూనే విద్య, ఉపాధి, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని, సమాజ హక్కుల పరిరక్షణలో ఐక్యంగా పనిచేస్తేనే భావితరాలకు బలమైన భవిష్యత్తు నిర్మించగలమని అభిప్రాయపడ్డారు.









