ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం

తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ 9 తెగల జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ (DE)

 

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం /ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కళారూపాలను ప్రతిబింబించేలా భారీ ర్యాలీ, సాంస్కృతిక ప్రదర్శనలు మరియు బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో చేపట్టిన జోడా యాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ 9 తెగల జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ (DE) గురువారం కరకగూడెం మండల కేంద్రంలో పర్యటించారు.

 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీల ఉనికి, ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు, జీవన విధానం మరియు రాజ్యాంగం కల్పించిన హక్కులను చాటిచెప్పే చారిత్రాత్మక దినమని ఆయన పేర్కొన్నారు.

 

భారత రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్, పీసా (PESA) చట్టం, అటవీ హక్కుల చట్టం–2006 వంటి చట్టాలు ఆదివాసీల రక్షణ కోసం రూపొందించబడినప్పటికీ, వాటి సంపూర్ణ అమలుకు ఇంకా కృషి అవసరమని అన్నారు. ఆదివాసీ ప్రజలు తమ హక్కులపై పూర్తి అవగాహన కలిగి, ఐక్యంగా ముందుకు సాగితేనే రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిస్థాయిలో సాధించగలమని ఆయన పేర్కొన్నారు.

 

ఆగస్టు 9న కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న భారీ ఆదివాసీ ర్యాలీకి సంప్రదాయ దుస్తులు, డోలు వాయిద్యాలు, నృత్యాలతో అన్ని గ్రామాల నుంచి వేలాదిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యువత, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాలు, ఆదివాసీ నాయకులు ఐక్యంగా పాల్గొని ఆదివాసీల ఐక్యతను ప్రపంచానికి చాటాలని కోరారు.

 

అనంతరం మండలంలోని నాయకులతో సమావేశమై ఆగస్టు 9 కార్యక్రమ విజయవంతానికి చేపట్టాల్సిన ఏర్పాట్లు, గ్రామాల వారీగా ప్రజల సమీకరణ, రవాణా సౌకర్యాలు, ప్రచార కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామంలో అవగాహన కల్పిస్తూ పెద్దఎత్తున ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు.

 

ఈ పర్యటనలో ఆదివాసీ నాయకులు, వివిధ ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, యువజన నాయకులు, మహిళా ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు మరియు మండలంలోని పలువురు ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram