లారీ ఢీకొని నాలుగేళ్ల చిన్నారి మృతి!

బాన్సువాడ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో పాఠశాలకు వెళ్లేందుకు తండ్రితో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరిన నాలుగేళ్ల చిన్నారి రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన ఘటన బాన్సువాడ పట్టణంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. అరాఫత్ కాలనీకి చెందిన మహమ్మద్ రఫీ తన ముగ్గురు పిల్లలను ద్విచక్ర వాహనంపై హీరా మోడల్ స్కూల్కు తీసుకెళ్తుండగా తాడ్కోల్ చౌరస్తా వద్ద ప్రమాదం జరిగింది. సిగ్నల్ వద్ద నుంచి ద్విచక్ర వాహనం ముందుకు వెళుతున్న క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బైకును ఢీకొట్టింది.

 

ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న చిన్నారి జైనబ్ ఫాతిమా రోడ్డుపై పడిపోగా, లారీ చక్రం ఆమెపై నుంచి వెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన ఇద్దరు చిన్నారులకు గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Facebook
WhatsApp
Twitter
Telegram