ఖైదీకి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తానంటూ డబ్బులు డిమాండ్.. మధ్యవర్తిగా పెట్రోల్ బంక్ ఆపరేటర్
హుజూరాబాద్ // లంచం తీసుకుంటూ హుజూరాబాద్ సబైజైలు డిప్యూటీ జైలర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఖైదీకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ములాఖత్‌లకు అవకాశం కల్పిస్తానని, ఖమ్మం జైలుకు బదిలీ కాకుండా చూస్తానని చెప్పి రూ. 10 వేల లంచం డిమాండ్ చేసినట్లు అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు తెలిపారు.ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సబైజైలులో డిప్యూటీ జైలర్‌గా పనిచేస్తున్న నాంపల్లి దేవేందర్ (46), అదే సబ్ జైలు పరిధిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్న రవుల హరీష్ (30) కలిసి లంచం వ్యవహారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
రూ.10 వేలు లంచం డిమాండ్
ఫిర్యాదుదారుడి మామగారు రిమాండ్ ఖైదీగా సబ్‌జైలులో ఉన్నారు. ఆయనకు జైలులో మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ములాఖత్‌లకు అనుకూలంగా వ్యవహరించడం, ఖమ్మం జైలుకు బదిలీ కాకుండా చూడడం వంటి అధికారిక అనుకూలతలు కల్పించేందుకు డిప్యూటీ జైలర్ దేవేందర్ రూ.10 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ పేర్కొంది.
ఈ మొత్తాన్ని పెట్రోల్ బంక్ ఆపరేటర్ రవుల హరీష్ ద్వారా స్వీకరించేందుకు చేసినట్లు తెలిపింది. ఏర్పాట్లు
రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ
సెప్టెంబర్ 7న సాయంత్రం 5:45 సమయంలో హుజూరాబాద్‌లోని ఇండియన్ ఆయిల్ సబ్ జైలు పెట్రోల్ బంక్ వద్ద ఏసీబీ కరీంనగర్ యూనిట్ అధికారులు దాడి నిర్వహించారు. ఈ సమయంలో డిప్యూటీ జైలర్ దేవేందర్ డిమాండ్ చేసిన రూ.10 వేల లంచాన్ని హరీష్ ద్వారా స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.
అనంతరం హరీష్ వద్ద నుంచి ఏసీబీ అధికారులు లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. రసాయన పరీక్షల్లో హరీష్ కుడి, ఎడమ చేతి వేళ్లకు పాజిటివ్ ఫలితం వచ్చినట్లు ఏసీబీ వెల్లడించింది.
అధికారిక పదవిని దుర్వినియోగం చేస్తూ అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిని కరీంనగర్‌లోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు తెలిపారు.









