లోక్‌ అదాలత్‌లతో సత్వర న్యాయం..

 – సమయం, ఆర్థిక భారం ఆదా చేసుకోవచ్చు..

 – కక్షిదారులు రాజీమార్గాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. 

 – మణుగూరు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కంభపు సూరిరెడ్డి

 

మణుగూరు : లోక్‌ అదాలత్‌ల ద్వారా కేసులను పరిష్కరించుకొని కక్షిదారులు ప్రశాంతమైన జీవితాన్ని పొందాలని మణుగూరు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కంభపు సూరిరెడ్డి సూచించారు. మణుగూరు కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. కోర్టుల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రాజీకి అవకాశం ఉన్న కేసులను లోక్‌ అదాలత్‌ల ద్వారా పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. దీనివల్ల కక్షిదారులకు విలువైన సమయంతో పాటు ఆర్థిక భారం కూడా తగ్గుతుందన్నారు. వివాదాలను సంవత్సరాల తరబడి కొనసాగించడం వల్ల ఇరుపక్షాలు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుందని, రాజీకి అవకాశం ఉన్న కేసుల్లో పట్టింపులకు పోకుండా సామరస్యపూర్వక పరిష్కారానికి ముందుకు రావాలని సూచించారు. లోక్‌ అదాలత్‌లో పరిష్కారమైన వివాదం ఇరుపక్షాల మధ్య విభేదాలను తగ్గించి సుహృద్భావ వాతావరణాన్ని ఏర్పరుస్తుందని పేర్కొన్నారు. న్యాయవాదులు కూడా తమ కక్షిదారులకు లోక్‌ అదాలత్ ప్రయోజనాలను వివరించి, రాజీకి అనువైన కేసులను పరిష్కరించుకునేలా ప్రోత్సహించాలని కోరారు. న్యాయవ్యవస్థ అందిస్తున్న ప్రత్యామ్నాయ వివాద పరిష్కార అవకాశాలను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా సత్వర న్యాయం పొందడంతోపాటు కోర్టులపై కేసుల భారాన్ని తగ్గించేందుకు సహకరించాలని మేజిస్ట్రేట్ కంబపు సూరిరెడ్డి పేర్కొన్నారు.

 

మొత్తంగా 342 కేసులు పరిష్కారం..

 

అనంతరం నిర్వహించిన లోక్ అదాలతో మొత్తంగా 342 కేసులు పరిష్కారం అయ్యాయి. వీటిలో పోలీస్, ప్రైవేట్ కేసులు కలిపి 94 కేసులు పరిష్కారం కాదా రూ.38,49,400/- లు జరిమానా, సెటిల్మెంట్ ద్వారా చెల్లింపులు జరిగాయి. వీటితోపాటు 244 పెట్టి కేసులలో కక్షిదారులు నేరం అంగీకరించడంతో వారికి మొత్తంగా రూ.1,96,800/- లు జరిమానా విధించింది. ఈ చలానా కేసులు 52 పరిష్కారం కాగా రూ. 23,400/- రాజీ పడిన కేసులలోని దక్షిదారులకు అవార్డు కార్డులను అందజేశారు. కార్యక్రమంలో మణుగూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రకాని గురు కృష్ణ, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ వీరంకి పద్మావతి, ప్రధాన కార్యదర్శి వీర మధుసూదన్, ఉపాధ్యక్షురాలు సావిత్రి, సీనియర్ న్యాయవాదులు పొనుగోటి కిషన్ రావు, జాడి చొక్కయ్య, అమృతలూరి రామ్మోహన్ రావు, చిర్రా రవికుమార్, మేదరమెట్ల శ్రీనివాస్ రావు, న్యాయవాదులు చిర్ర సరస్వతి, సర్వేశ్వర రావు, సంధ్య, వాసవి తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram