చలో ITDA భద్రాచలం ఆదివాసీ మార్చ్ కరకగూడెం నుంచి సమర శంఖం.
ఆదివాసీ హక్కులు–ఏజెన్సీ చట్టాల అమలుపై తుడుందెబ్బ, ASU డిమాండ్
కరకగూడెం మండలం :-
తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్ పిలుపు మేరకు సెప్టెంబర్ 21న నిర్వహించనున్న “చలో ITDA భద్రాచలం” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను కరకగూడెం మండలం పలు గ్రామాలలో ఆవిష్కరించారు.
భద్రాద్రి జిల్లా కార్యదర్శి పోలేబోయిన వెంకటనారాయణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కలం వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తుడుందెబ్బ జాతీయ ఉపాధ్యక్షులు పోడెం బాబు, ASU రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోర్నిబెల్లి గణేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలకు రాజ్యాంగం, చట్టాల ద్వారా కల్పించిన హక్కులు అమలు కావాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా *5వ షెడ్యూల్, 1/70 చట్టం, PESA, ROFR, GO-3,* ఏజెన్సీ పరిపాలనకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు.
ప్రధాన డిమాండ్లు:
ఏజెన్సీ ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన
రాజ్యాంగపరమైన రక్షణలు, 5వ షెడ్యూల్ నిబంధనలు పటిష్టంగా అమలు చేయాలి.
ఏజెన్సీ ప్రాంతాల్లో అమలులో ఉన్న 29 శాఖల సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
GO-3తో పాటు ఏజెన్సీ ఉద్యోగాలు, స్థానిక హక్కులకు సంబంధించిన నిబంధనలను అమలు చేయాలని కోరారు.
1/70 చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేసి, ఆదివాసీ భూముల అక్రమ బదలాయింపులను అరికట్టాలని డిమాండ్ చేశారు.
ఆదివాసీల అటవీ హక్కులు, ROFR పట్టాల సమస్యలను పరిష్కరించి అర్హులైన గిరిజన రైతులకు హక్కులు కల్పించాలని కోరారు.
DSC, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఏజెన్సీ అభ్యర్థులకు 75 శాతం ఉద్యోగాల అంశాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఏజెన్సీ ప్రాంతాల్లోని విద్యా సంస్థలు, ఆసుపత్రులు, మౌలిక వసతులను బలోపేతం చేయాలని కోరారు.
గోదావరి పరివాహక ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ఏజెన్సీ ప్రాంతాల సాగుభూములకు నీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ విద్యార్థులకు ప్రత్యేక విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.
KTPS, BTPS తదితర పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల్లో స్థానిక ఆదివాసీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
నాయకులు మాట్లాడుతూ పై డిమాండ్లపై ప్రభుత్వం, ITDA అధికారులు స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదివాసీ హక్కులు, ఏజెన్సీ చట్టాల అమలు, ఉద్యోగాలు, భూమి, విద్య, సాగునీరు తదితర అంశాలపై తమ డిమాండ్లను ITDA అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సెప్టెంబర్ 21న “చలో ITDA భద్రాచలం” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ యువత, గ్రామ పెద్దలు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.









